‘డాడీ’ సినిమాతో ఎంటర్ అయిన ఈ డాడీకి 2014 బాగా కలిసొచ్చిందట. ఈ సంవత్సరం అల్లు అర్జున్ కు డాడీగా ప్రమోషన్ వచ్చింది. ఆయన సుపుత్రుడు అల్లు అయాన్ ఫేస్ బుక్కుల్లో, వార్తల్లో బాగా హల్ చల్ చేస్తున్నాడు. ఈ బుజ్జిగాడూ పేద్ద సెలబ్రిటీ అయిపోయాడిప్పుడు. అంతేకాదు బాబు పుట్టాక నాకు బాగా కలిసొచ్చిందనీ, తన జీవితమే మారిపోయిందని అల్లు అర్జున్ తెగ సంబర పడిపోతున్నాడు. వాళ్ళబ్బాయి పుట్టాక రేస్ గుర్రం విడుదలైందని సినిమా బాగా హిట్టయ్యిందని చెప్పుకుంటున్నాడు అల్లు అర్జున్ ఇంటర్వ్యూల్లో. అబ్బాయి పుట్టిన క్షణంలో బాబును చూసినప్పటి ఫీలింగ్ లైఫ్ లో ఎప్పటికీ మరిచిపోలేనిదనీ, అంతకు ముందుకన్నా డాడీగా ఇప్పుడు తాను ఎంతో ఆనందంగా ఉన్నానని చెపుతున్నాడు. నిజమే... మరి పుత్రోత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది అల్లు అర్జున్ ముఖంలో. అయాన్ పుట్టిన వేళా విశేషం... ఈ సంవత్సరం హిట్ అయిన సినిమాల్లో అర్జున్ రేసు గుర్రం ఒకటి. నిజం చెప్పాలంటే ఈ సంవత్సరం హిట్స్ తక్కువే. అందులో రేసు గుర్రం సూపర్ డూపర్ హిట్. అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. గుణశేఖర్ ‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డి పాత్రలో మరో ప్రత్యేక గెటప్ లో కనిపించబోతున్నాడు. ఈ డాడీ కొత్త సంవత్సరంలో కూడా సూపర్ డూపర్ హిట్ లు ఇవ్వాలని కోరుకుందాం.