బాలనటుడిగా ఇండస్ట్రీకి అరంగ్రేటం చేసి హీరోలుగా వెలుగొందిన వారు చాలా తక్కువే అని చెప్పాలి. మహేష్, ఎన్టీఆర్ లాంటి బడా స్టార్లు ఇలా తెరపైకి వచ్చినవారే. వీరితోపాటు పృథ్వీ, రిషి, బాలాదిత్య లాంటి వారు కూడా హీరోలుగా చెలామణి అయిన వారే. కానీ, వీరందరిలోకి ప్రత్యేకం మాత్రం తరుణ్. స్టార్ హీరోలతో బాలనటుడిగా కెరీర్ ను ప్రారంభించిన తరుణ్ ఆ తర్వాత ప్రేమకథ చిత్రాలతో హీరోగా పరిచయమయ్యాడు. కొద్ది కాలంలోనే లవర్ బాయ్ ట్యాగ్ లైన్ తగిలించుకుని దశాబ్దంపాటు ఇండస్ట్రీని ఏలాడు. అదే సమయంలో ఉదయ్ కిరణ్ లాంటి యువనటుడు వచ్చినప్పటికీ వారందరికీ పోటీనిచ్చి హిట్ లు అందించాడు. అగ్రహీరోయిన్లు అందరితో నటించిన హీరోగా తరుణ్ కి పేరుంది. అయితే రాను రాను హిట్లు లేకపోవటం, దాంతో పాటు ఆఫర్లు లేకపోవటంతో గత కొద్ది కాలంగా ఖాళీగానే ఉంటున్నాడు. అడపాదడపా క్రికెట్ మ్యాచ్ ల్లో సందడి చేస్తున్నప్పటికీ చేతిలో సినిమాలు ఉన్నాడు. కానీ ఇప్పుడు సోలో హీరోగా ఓ చిత్రం ప్రారంభించాడు. దర్శకరత్న చేతుల మీదుగా క్లాప్ నివ్వగా, ఈ కార్యక్రమానికి నిర్మాత సురేష్ బాబు, శ్రీకాంత్ లు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. అదంతా బాగానే ఉన్నా... అక్కడ వెలిసిన పోస్టర్లను చూసి జనాలు నవ్వుకున్నారట. లవర్ బాయ్ తరుణ్ నటిస్తున్న చిత్రమని బ్యానర్ లు అక్కడ ఉన్నాయట. ఇది చూసిన వారంతా మూడు పదులు దాటిపోయిన తరుణ్ ఇంకా లవర్ బాయే నా అని నవ్వుకున్నారట.