సౌత్ టాప్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తండ్రి ప్రముఖ సినీ రైటర్ సత్యమూర్తి (61) ఇక లేరు. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఆయనకు గుండెపోటు రాగా, హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. దాదాపు 90 సినిమాలకు పైగా రచయితగా పనిచేసిన సత్యమూర్తి మంచి రచయితగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తండ్రి బాటలో దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా చిత్ర రంగ ప్రవేశం చేశారు.
రచయితగా ఆయన తొలి సినిమా దేవత. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు రచయితగా పనిచేసారు. ఛాలెంజ్, చంటి, భలేదొంగ వంటి హిట్ చిత్రాలకు ఆయనే రచయిత. సత్యమూర్తి ఇద్దరు తనయులు (దేవిశ్రీప్రసాద్, సాగర్) కూడా సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఓ మంచి గుర్తింపును దక్కించుకున్నారు. నేటి సాయంత్రం చెన్నైలోనే సత్యమూర్తి అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతికి నీహార్ ఆన్ లైన్ ప్రగాఢ సంతాపం తెలుపుతోంది.