ధనుష్ హీరోగా గతేడాది తమిళంలో ఘనవిజయం సాధించిన వెలైయిల్లా పట్టాధారి (వీఐపీ) చిత్రం తెలుగులో రఘువరన్ బీ.టెక్. గా ముందుకు రాబోతుంది. ఈ చిత్ర ట్రైలర్ ను ఇటీవలె విడుదల చేశారు. బీ.టెక్. పూర్తిచేసి ఉద్యోగం చేయకుండా ఖాళీగా తిరిగే ఒక యువకుడి కథే ఈ చిత్రం. తల్లిదండ్రుల సెంటిమెంట్ ఈ చిత్రంలో కీలకం. దర్శకుడు సముద్రఖని ఈ చిత్రంలో ధనుష్ తండ్రి పాత్రలో నటించాడు. అమలాపాల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి కొలవెరి ఫేమ్ అనిరుధ్ సంగీతం అందించాడు. ఎన్ హెచ్ 4 చిత్ర దర్శకుడు వేల్ రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఉన్న ముందుగా ఈ చిత్రాన్ని తెలుగులో హీరో రామ్ తో రీమేక్ చేద్దామనుకున్నారు. అయితే రామ్ ఈ ప్రాజెక్ట్ పట్ల ఇంట్రస్ట్ చూపకపోవడంతో ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులో డబ్ చేస్తున్నారు. రామ్ తో సినిమా చేద్దామనుకున్న స్రవంతి కిషోర్ యే ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయబోతున్నారు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడి పాత్రలో ధనుష్ నటన ప్రేక్షకులతోపాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.