మహేష్ అమీర్ ఖాన్ కన్నా పర్ఫెక్షనిస్ట్: కొరటాల

July 29, 2015 | 02:20 PM | 2 Views
ప్రింట్ కామెంట్
koratalashiva_mahesh_srimanthudu_niharonline

మొదటి సినిమా ప్రభాస్ ‘మిర్చి'తో దర్శకుడిగా హిట్ అనిపించుకున్నాడు కొరటాల శివ. ఇక రెండో సినిమా ‘శ్రీమంతుడు' ఓ కొత్త కాన్సెప్ట్ తో సూపర్ హిట్ చేసేందుకు కృషి చేశాడు ఈ దర్శకుడు.  ఈ చిత్రాన్ని మహేష్ బాబుతో పాటు  మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌, మోహన్‌ నిర్మించారు. ఈ చిత్ర విశేషాలను వివరిస్తూ మీడియాతో మాట్లాడారు కొరటాల శివ.... ఇందులో మహేష్ బాబును గురించి చాలా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. మహేష్ బాబు ప్రొఫెషనలిజమ్ చాలా పీక్ లో ఉంటుందని చెప్పుకొచ్చారు.

భారతదేశంలోని అత్యుత్తమ నటుల్లో మహేష్‌ ఒకరనీ, పాత్రని దాటి ఆయనేదీ చేయరన్నారు. విజిల్స్‌ పడేలా డైలాగ్ మరోలా చెబుదాం... అని  అన్నా కన్విన్స్ కారనీ, కథని, పాత్రని దాటి ఒక్క ఇంచి కూడా ముందుకు వేయరన్నారు.

షాట్‌ చేసేప్పుడు మానిటర్‌లో చూస్తూ నేను ఒకే.... సూపర్‌గా ఉంది అని తాను అన్నా కూడా... కన్విన్స్ కాకుండా ఇంకో టేక్‌ చేసి చూస్తానని మహేష్ చేస్తారనీ...  ప్రొఫెషనలిజమ్‌లో అంతటి నిబద్ధత ఆయనలో ఉంటుందని కొరటాల మహేష్ గురించి అన్నారు. ఆయన డెడికేషన్ చూసి తాను  సిగ్గుపడ్డ సంర్భాలున్నాయని కొరటాల శివ చెప్పుకొచ్చారు.

ఈ సినిమాలో ఆయన చెప్పిన డైలాగ్స్‌ని ఓ ప్రేక్షకుడిగా చాలా ఎంజాయ్‌ చేశాననీ, ఈ సినిమాకు మొదటి ప్రేక్షకుణ్ణి తానేనని అన్నారు. తను రాసిన  రాసుకున్న మాటలు మహేష్ బాబు నోటినుంచి వస్తుంటే... మానిటర్‌ ముందు ఓ డైరెక్టర్‌గా కంటే ఓ ప్రేక్షకుడిగానే ఎక్కువ ఎంజాయ్‌ చేశానన్నారు.
తను తీసేదేదీ కథకు అతీతంగా వెళ్ళ కూడదని అనుకున్నాడట. తన స్టైల్ లోనే వెళ్ళాలన్నట్టుగా తీసానన్నాడు. అలాగే తెరమీద ఏది కనిపించినా కథకు అనుగుణంగానే కనిపిస్తుందన్నాడు కొరటాల శివ. శ్రుతి హాసన్‌, జగపతిబాబు, సుకన్య, రాజేంద్రప్రసాద్‌ ఇలా ప్రతి పాత్రలోనూ నటీనటులు కాకుండా కేవలం ఆ పాత్ర మాత్రమే కనిపిస్తుందన్నాడు.  రచయిత ఊహ ఎప్పుడూ అందంగా ఉంటుంది. అది తెరమీద 50 శాతం మేర బాగా వచ్చినా చాలనుకుంటారు... కానీ మహేశ్‌ దాంతో తృప్తిపడరనీ,  కేరక్టర్‌ను పట్టించుకున్న రోజు నుంచీ డబ్బింగ్‌ చెప్పేదాకా దానిలోనే ఉంటారనీ, దానికి విభిన్నంగా ఉండరని అన్నారు.

కథలు పెద్ద హీరోలకే రాసుకుంటారా? అన్న విషయానికి వస్తూ... అలాంటిదేమీ లేదనీ, కొత్తవాళ్లతోనూ సినిమాలు తీయాలని ఉందన్నారు.  సీతాకోకచిలుక లాంటి ఓ విభిన్నమైన కథ దొరికితే తప్పకుండా కొత్తవాళ్లతోనే చేస్తా నన్నారు. చిన్న కథైనా, స్టార్‌ సినిమా అయినా చెప్పాలనుకొన్న విషయాన్ని బలంగా, బల్లగుద్దినట్టు చెబుతానని అన్నారు.

షూటింగ్ లో మహేష్ బాబు ఎలా ఉంటారన్నదానికి...  ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారనీ... మంచి ఎండాకాలంలో ఈ సినిమా షూటింగ్‌ చేశాం... అయినా అలాంటి వేడి వాతావరణాన్ని తన జోకులతో లైవ్‌లీగా ఆయన మార్చేసేవాళ్లు. నవ్వులేకపోతే ఆయన బతకలేరు. తను నవ్వుతుంటారు, అందర్నీ నవ్విస్తుంటారు. మహేష్ బెస్ట్‌ యాక్టర్‌ అనేది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని పక్కన పెడితే అంతకంటే ఎక్కువ హ్యూమర్‌ను ఇప్పటివరకూ ఎవరిలోనూ నేను చూడలేదు. సెట్స్‌ పై ఉదయం నుంచి సాయంత్రం వరకూ షాట్‌ టైమ్‌లో తప్ప మిగతా టైమ్‌లో జోకులు పడిపోవాల్సిందే. ఆయనలో సూపర్ స్టార్ కనపడడు...   ఒక సారి సెట్‌కొచ్చి, కేరవాన్‌ నుంచి దిగితే, ఆయనలో సూపర్‌స్టార్‌ మనకు కనిపించడు. ఎలాంటి హడావుడీ లేకుండా కామ్‌గా వచ్చి కూర్చుంటారు. ఎలాంటి ఆర్భాటాలూ, హంగులూ ప్రదర్శించరు. నేను పరిశీలించినంత వరకు మహేశ్‌ మన కాలపు ఉత్తమ నటుల్లో ఒకరనీ... ఆయన పర్ఫెక్షనిస్ట్‌ అనీ అమీర్‌ఖాన్‌ కంటే  పర్ఫెక్షనిస్టని మహేష్ కు కితాబిచ్చారు కొరటాల శివ.
తదుపరి సినిమా గురించి అడిగితే... ఇంకా ఏం అనుకోలేదు. 'శ్రీమంతుడు' స్పందన చూసి తదుపరి ఎలాంటి కథ చెప్పాలనేది ఆలోచిస్తా నన్నారు.
శ్రీమంతుడు కథకు ప్రేరణ... వారెన్‌ బఫెట్‌ తన సంపాదనలో ముప్పావు భాగం తిరిగి సమాజానికే ఇచ్చేశాడు. అలాగే బిల్‌ గేట్స్‌ సగం సంపాదనను ఫౌండేషన్‌కు ఇచ్చేశాడు. విప్రో ప్రేమ్‌జీగారూ అంతే. వాళ్లలో నేను హీరోయిజం చూశాను. ఈ విషయాన్నే మృదువుగా కాకుండా కమర్షియల్‌ పంథాలో ఎమోషనల్‌గా, హార్డ్‌ హిట్టింగ్‌గా చెప్పా. ఉన్నదాన్ని పంచిపెట్టడాన్ని మించిన హీరోయిజం ఎక్కడుంది? అందుకే ఈ అంశం నన్ను బాగా ప్రేరేపించిందన్నారు.
'శ్రీమంతుడు' ఎలా ఉంటాడు? అంటే...  నా 'శ్రీమంతుడు' చాలా సింపుల్‌ వ్యక్తి. వేల కోట్ల అధిపతి అయినా, మనలా మాములు మనిషిలానే ఉంటాడు. విమానాల్లో తిరగ్గలడు, అవసరమైతే కాకా హోటల్‌లో టీ తాగేంత సాధారణ జీవితమూ గడపగలడు. అలాంటి ఓ వ్యక్తి ప్రయాణం నా సినిమా. అతనికి సైకిల్‌ అంటే ఇష్టం. సైకిల్‌ తొక్కుకుంటూ ఎక్కడికైనా వెళ్లిపోతుంటాడన్నాడు.

కథలోని విషయం చూచాయగా తెలిసినా... కథనం నడిపించడంలో డైరెక్టర్ ఎంత సక్సెస్ అయ్యాడన్నది తెలియాలంటే ఆగస్టు 7 వరకు వెయిట్ చేయాల్సిందే...

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ