ఇటీవలి కాలంలో డైరెక్టర్ల స్ట్రాటజీ అంతా మారిపోతోందండీ... సినిమా విడుదలకు ముందే డైరెక్టర్లు కూడా కొన్ని ఏరియాల వాటాలు తమకివ్వాలంటూ మాట తీసేసుకుంటున్నారు. మరి కొందరు ఓవర్సీస్ హక్కులు తీసేసుకుంటున్నారు. కొందరు బిజినెస్ పెంచుకుంటుంటే మరి కొందరు సినిమా హిట్, ఫ్లాపులతో నిర్మాతలకు నష్టం రాకుండా... వాటా అడుగుతున్నారు. ఇది ఒక విధంగా మంచి పరిణామమనే చెప్పాలి. ఈ విధానం కొందరు హీరోలు కూడా పాటించేస్తున్నారు.
డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా ఇక నుంచి సినిమాకు రెమ్యునరేషన్ కాకుండా వాటా తీసుకునే ట్రెండ్ మొదలు పెట్టారు. అది ఆయన ఇప్పుడు తీయబోయే అ...ఆ సినిమాతో మొదలు పెట్టారు. ఈ విధానం ఆ డైరెక్టర్ కాన్ఫిడెన్స్ కు పరీక్ష అనుకోవచ్చు. మరో రకంగా నిర్మాతను నష్టాల ఊబిలోకి నెట్టేయకుండా వారికి కాస్త మేలు కూడా చేస్తున్నట్టు అనుకోవచ్చు. ఇప్పుడు త్రివిక్రమ్ హీరో నితిన్ తో అ .. ఆ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే, ఇటీవలే షూటింగ్ మొదలు పెట్టిన ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇంతకు ముందు జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాల నిర్మాత రాధాకృష్ణ (హారిక .. హాసిని క్రియేషన్స్ ) ఈ సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాన్ని నిర్మించాడు. అయితే ఈ సినిమాకు లాభాలు రాలేదని తెలుస్తోంది. దాంతో ఇకపై రెమ్యునరేషన్ వద్దని సినిమాలో వాటా కావాలని అడుగుతున్నాడు ఈ మాటల మాంత్రికుడు. ఆయన స్ట్రాటజీ చూస్తుంటే తెలుగు సినిమా నిర్మాతలకు ఈ విధానం కాస్త ధైర్యాన్ని ఇచ్చినట్టవుతుంది.