టాలీవుడ్ లో మెరిసిన బాలీవుడ్ స్టార్లు

November 27, 2015 | 04:38 PM | 4 Views
ప్రింట్ కామెంట్
bollywood-stars-cameo-role-in-telugu-movies-niharonline

టాలీవుడ్ లో ఛాన్స్ దొరికితే చాలు ఎలాంటి పాత్రలో అయినా నటించేందుకు బాలీవుడ్ స్టార్లు ఎప్పటికీ సిద్ధంగా ఉంటారు. ఇండస్ట్రీపరంగా బాలీవుడ్ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, ఎక్కువ సినిమాలతో టాప్ లిస్ట్ లో ఉండేది టాలీవుడే. అంతేకాదు కథా, కథానాల విషయంలో బాలీవుడ్ ఎప్పటికీ టాలీవుడ్ ను కాపీ కొడుతూనే ఉంటుంది. ఇక ఇక్కడ కొందరు నటీనటులు తెలుగు సినిమాల్లో తళుక్కున మెరవటం జరిగింది. వారి గురించి...

 

సంజయ్ దత్:  బాలీవుడ్ లో మున్నాభాయ్ గా వెలుగొందిన సంజయ్ దత్ అందరి చేత భాయ్ అని పిలిపించుకుంటారు. అలాంటి సంజయ్ దత్ ఓ తెలుగు చిత్రంలో నటించారనే విషయం చాలా మందికి తెలియక పోవచ్చు. కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున నటించిన చంద్రలేఖ చిత్రంలో సంజయ్ దత్ ఓ చిన్నపాత్రలో నటించారు. రాజ్ కుమార్ అంటూ నాగ్ ని కాసేపు టెన్షన్ పెట్టే పాత్రలో సంజయ్ అలరిస్తాడు. ఓ పిచ్చి వాడి పాత్రలో ఐదు నిమిషాలు ఉండే ఆ పాత్ర హస్యభరితంగా ఉంటుంది.

జానీ లివర్: బాలీవుడ్ కమెడియన్. ఒకానోక టైంలో మనకు బ్రహ్మానందం ఎలాగో, టాలీవుడ్ కు ఆయన అలాగా ఉండేవాడు. నిజానికి జానీ లివర్ ఓ తెలుగు వ్యక్తే. ప్రకాశం జిల్లాలో జన్మించిన జాన్‌ ప్రకాష్‌రావు జనుముల, బాలీవుడ్‌లో జానీ లీవర్‌ ఏలాడు. హిందుస్థాన్ లివర్ లో పనిచేయటం మూలంగా ఆయన పేరు జానీ లివర్ గా మారింది. ఇక అతగాడు నటించిన తెలుగు చిత్రం క్రిమినల్. అందులో ఆస్పత్రిలో బ్రహ్మీ, గుండు హన్మంతరావులను ఆటపట్టించే పిచ్చి వ్యక్తి క్యారెక్టర్ లో లీవర్ కనిపిస్తాడు.

అమితాబ్ బచ్చన్: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్... అసలు సౌత్ సినిమాలో కనిపించడమే ఎక్కువ అంటే. ఏకంగా ఓ తెలుగు సినిమాలో గెస్ట్ లో కనిపించారాయన. అదే అక్కినేని వంశ చిత్రం మనం. ఇందులో డాక్టర్ గా, ఓ ఆస్పత్రి హెడ్ గా నటించాడు. నాగ్ అమితాబ్ కి ఫోన్ చేసి ఓ నిమిషంపాటు మాట్లాడతాడు. సాధారణంగా సౌత్ సినిమాలో ఇప్పటిదాకా కనిపించని అమితాబ్ అక్కినేని ఫ్యామిలీతో ఉన్న అనుబంధం కారణంగానే ఆ రోల్ చేయటానికి ఒప్పుకున్నట్లు స్వయంగా తన బ్లాగ్ లో చెప్పటం విశేషం.

ఇర్ఫాన్ ఖాన్ : నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి వచ్చిన ఈ నటుడు పలు బాలీవుడ్ చిత్రాల్లో జీవించేశాడు. అంతర్జాతీయ స్థాయి నటుడిగా గుర్తింపు ఉన్న ఇర్ఫాన్ ఖాన్ ఇప్పటి దాకా చేసిన ఏకైక తెలుగు చిత్రం సైనికుడు. ఇందులో మహేష్ బాబు ఢీకోట్టే విలన్ గా అలరించాడు ఇర్ఫాన్ ఖాన్. సినిమా ఆడకపోయినప్పటికీ హీరోయిన్ లవర్ గా, కాస్తంత కామెడీ టచ్ ఉన్న విలన్ పాత్రలో ఆయన నటన ఇప్పటికీ మనకు గుర్తుంటుంది.

జాకీ ష్రాఫ్: 90వ దశకంలో బాలీవుడ్ లో స్టార్ హీరోగా చెలామణి అయ్యాడీ నటుడు. ఆపై అడపాదడపా గెస్ట్ రోల్స్ చేసుకుంటూ వస్తున్నాడు. అలాంటి జాకీ షాఫ్ర్ మంచు విష్ణు హీరోగా వచ్చిన అస్త్రం సినిమా ద్వారా విలన్ గా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. అమీర్ ఖాన్ సర్ఫరోష్ చిత్రానికి రీమేక్ గా వచ్చిన అది పెద్దగా ఆడలేదు. ఆపై కాస్త గ్యాప్ తో స్టైలిష్ దర్శకుడు విష్ణువర్ధన్ పవన్ కళ్యాణ్ తో తీసిన పంజాలో విలన్ పాత్రలోనే నటించాడు. కానీ, దాని ఫలితం కూడా బోల్తా పడటంతో ఇక తిరిగి తెలుగులో కనిపించలేదు.

బిపాసా బసు: బాలీవుడ్ లో బోల్డ్ చిత్రాలకు పెట్టింది పేరైనా ఈ డస్కీ బ్యూటీ ఓ తెలుగు చిత్రంలో నటించిందంటే ఎవరికీ తెలియదేమో. అదీ కూడా సూపర్ స్టార్ మహేష్ సరసన. టక్కరి దొంగ చిత్రంలో మహేష్ అంటే పడిచచ్చే అమ్మాయి క్యారెక్టర్లో బిపాసా కనిపిస్తుంది. అందులో ఆమెది దొంగ పాత్ర కావటం, హీరో కూడా ఆమెను సరదాగా ఆటపట్టించడం మనం చూడొచ్చు.

బొమన్ ఇరానీ: అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ తాతగా వీల్ చైర్ కి అంకితమయ్యే పాత్రలో కనిపించేంది ఈయనే. బాలీవుడ్ విలక్షణ నటుడిగా పేరుండి, పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆయన ప్రస్తుతం రవితేజ బెంగాల్ టైగర్ లో కూడా ఓ కీలకపాత్ర పోషిస్తుండటం విశేషం.

అతుల్ కులకర్ణి: బాలీవుడ్ సహజనటుడిగా పేరున్న వ్యక్తి. రంగ్ దే బసంతీ చిత్రంలో ఓ కీలకపాత్రను పోషించిన ఈ రంగస్థల నటుడు తెలుగు చిత్రాల్లో కూడా మెరిశాడు. వెంకటేష్ హీరోగా వచ్చిన జయం మనదేరా చిత్రంలో దళిత సర్పంచ్ పాత్రతోపాటు, సుమంత్ గౌరీ, పవన్ పంజాలో విలన్ గా నటించాడు.  

వీరే కాదు పరేష్ రావెల్ క్షణక్షణం, గోవిందా గోవిందా, శంకర్ దాదా ఎంబీబీఎస్, గుల్షన్ గ్రోవర్ క్రిమినల్, సురేష్ ఒబెరాయ్ బాలకృష్ణ బారతంలో బాలచంద్రుడు వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. వర్మ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన మనోజ్ బాజ్ పాయి ప్రేమకథ, హ్యాపీ, వేదంలలో మెరిశాడు. హీరోయిన్లలో కత్రనాకైఫ్ కు మొదటి సక్సెస్ ఇచ్చిందే టాలీవుడ్. మల్లీశ్వరి తో ఆమె మొదటి హిట్ అందుకుంది. ఆపై బాలయ్యతో అల్లరి పిడుగులో జత కట్టింది. ప్రీతి జింటా వెంకటేష్ తో ప్రేమంటే ఇదేరా, మహేష్ డెబ్యూ మూవీ రాజకుమారుడులో నటించింది. ఒకప్పటి హీరోయిన్ రవీనా టండన్ కూడా వినోద్ కుమార్ సరసన రథ సారథి, ఆపై బాలయ్యతో బంగారు బుల్లోడు చిత్రాల్లో ఆడిపాడింది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ క్వీన్ గా చెలామణి అవుతున్న కంగనా రనౌత్ కూడా తెలుగు లో నటించింది. ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ లో ఆమె తళుక్కుమంది.  ఇక ప్రియాంక చోప్రా కూడా తెలుగు లో నటించటం విశేషం. అపూర్వం అనే పేరుతో వచ్చిన ఆ చిత్రం విడుదలకు నోచుకోలేదు. ఆ తర్వాత రాంచరణ్ తో తుఫాన్ తీయటం, అది ఏమైందో అందరికీ తెలిసిందే. విక్కీ దాదా, శాంతి క్రాంతి చిత్రాల్లో నాగ్ కి జోడీగా ఒకప్పటి నటి జూహీ చావ్లా నటించింది.  అనిల్ కపూర్ వంశవృక్షం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఇలా ఈ జాబితా చాలానే ఉంది. ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే మన్నించగలరు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ