ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి వికలాంగ మహిళ అరుణిమా సిన్హా... ఈ క్రీడాకారిణి జీవితం చాలా మందికి స్ఫూర్తినివ్వగలదనే ఆలోచనతో ఈమె జీవితం ఆధారంగా ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు
దర్శక - నటుడు ఫర్హాన్ అఖ్తర్. పరుగుల వీరుడు మిల్కాసింగ్ జీవితం ఆధారంగా ‘భాగ్ మిల్కా భాగ్’ లాంటి నిజజీవిత కథా చిత్రానికి తెరపై ప్రాణం పోసిన ఆయన ఇప్పుడు అరుణిమా సిన్హా జీవితంపై దృష్టి సారించారు. ఇందుకోసం ఆయన ఈ వారం లక్నో వెళ్లి, అరుణిమను స్వయంగా కలసి, ఈ బయోపిక్ ప్రతిపాదన చేశారు. జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారిణి అయిన అరుణిమ 2011లో రైలు ప్రయాణంలో దోపిడీ దొంగల్ని ఎదుర్కొన్న సంఘటనలో ఆమెను రైలులో నుంచి కిందకు తోసేశారు. ఆ ప్రమాదంలో ఆమె కాళ్లలో ఒకటి తొలగించాల్సి వచ్చింది. ఆమె ఒంటికాలితో.... ఎవరెస్ట్ శిఖరారోహణ గురించి ఫర్హాన్ చదివారు. ‘బోర్న్ ఎగైన్ ఆన్ ద మౌంటెన్’ అంటూ అరుణిమపై వచ్చిన పుస్తకం అరుణిమ లాంటి వ్యక్తుల జీవితంపై సినిమా తీస్తే అది మరింత మందికి స్ఫూర్తినిస్తుందని ఫర్హాన్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ సినిమాకు తనకు వచ్చే రాయల్టీతో నిరుపేదలు, వికలాంగులకూ ఒక ఉచిత స్పోర్ట్స్ అకాడమీ స్థాపించాలని అరుణిమ భావిస్తున్నారు. లక్నోకు దగ్గరలో ‘పండిట్ చంద్రశేఖర్ వికలాంగ్ ఖేల్ అకాడమీ’ పేరిట సంస్థను నెలకొల్పాలనుకుంటున్న ఆమె ఇప్పటికే తనకు వస్తున్న ఆర్థిక సహాయం మొత్తాన్నీ అటు మళ్లిస్తున్నారు. ఆమె సాహసాలే కాదు, సమాజ సేవ కూడా చేయగలదని నిరూపించుకున్నారు.