జేమ్స్ బాండ్ సిరీస్ లో మరో మూవీ ‘స్పెక్టర్’వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అక్కడి సినిమాలకు అయ్యే బడ్జెట్ చూస్తే మన ఇండియన్ సినిమా నిర్మాతల గుండెలు బాదుకుంటారు. ఓ సీన్ కోసం మన వాళ్ళు ఓ కోటి ఖర్చు పెడితే చాలా ఎక్కువ అన్నట్టు లెక్క కానీ స్పెక్టర్ సినిమా కోసం ఒక యాక్షన్ సీక్వెన్స్ కు ఏకంగా రూ.240 కోట్లు ఖర్చు చేసేస్తున్నారట. ఇంత భారీ ఖర్చు ఇంతకుముందెప్పుడు చేయలేదట. ఈ విషయం ఇప్పుడు ప్రపంచ వార్త అయ్యింది.
డేనియల్ క్రెయిగ్ జేమ్స్ బాండ్ గా నటిస్తున్న నాలుగో సినిమా మొత్తంగా జేమ్స్ బాండ్ సిరీస్ లో వస్తున్న 24వ సినిమా. శామ్ మెండెస్ దర్శకత్వం వహిస్తున్నాడు ఈ సినిమాకు. దాదాపు రూ.2 వేల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది. దీని కోసం ఈ మధ్య భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారు. ఈ సన్నివేశంలో భాగంగా ఖరీదైన 7 ఆస్టన్ కార్లను ధ్వంసం చేశారట.
ఇప్పటి వరకూ ప్రపంచ సినీ చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీగా ఈ యాక్షన్ సీక్వెన్స్ తీసినట్లు చెబుతున్నారు. అసలు జేమ్స్ బాండ్ సినిమాలంటేనే యాక్షన్ ప్రియులకు పండగలా ఉంటాయి. గత జేమ్స్ బాండ్ మూవీ స్కై ఫాల్ జనాల్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ ఏడాది ఆఖర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందట.