ఒక బిడ్డ తల్లయినా ఏ మాత్రం చెక్కుచెదరని అందంతో హాసిని పాప అందరినీ ఆకట్టుకుంటోంది. ఇటీవల మళ్ళీ తెరపైకి వస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించింది. ఇక అభిమానులు ఎప్పుడెప్పుడు ఈమెను తెరమీద చూద్దామా అని ఏ దర్శక నిర్మాతలు ఈమెకు సినిమా ఆఫర్ ఇస్తారా? అని ఎదురు చూస్తున్నారు. కానీ జెనీలియా ప్లానింగ్స్ మామూలుగా లేవండోయ్... ఓ సొంత సినిమా నిర్మించాలనే ఆలోచనల్లో ఉంది. నిర్మాత అంటే ఏదో చిన్న సినిమా అనుకునేరు... కానే కాదు బాహుబలి లాంటి చారిత్రక సినిమా తీయాలనే ప్లానింగ్ లో ఉందట. ఆమె భర్త రితేశ్ దేశ్ముఖ్ కి ఎప్పట్నుంచో ఓ కల ఉంది. ఛత్రపతి శివాజీ జీవితం ఆధారంగా ఓ సినిమా చేయాలని అందులో తానే నటించాలని కలలుకంటున్నాడట. ఆ కలని నెరవేర్చే దిశగా ఇప్పుడు జెనీలియా అడుగులేస్తున్నట్టు సమాచారం. రితేశ్ తీసే సినిమాకి జెనీలియా నిర్మాతగా వ్యవహరిస్తుందట. ఛత్రపతి శివాజీ జీవితం ఆధారంగా ఓ మామూలు సినిమా తీయాలని రితేశ్ అనుకొంటే... దాని స్థాయిని మరింత పెంచుతూ తీస్తే బాహుబలిలా గ్రాండ్ గా తీద్దాం అని ఐడియా ఇచ్చిందట జెనీలియా. దీంతో రితేశ్ మరో నిర్మాతని కూడా కలుపుకొని భారీ వెంచర్ కి ప్లాన్ చేశాడట. త్వరలోనే ఆ సినిమా గురించి అధికారికంగా వివరాలు బయటికొచ్చే అవకాశాలున్నాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ సినిమాతోనే మళ్లీ జెనీలియా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టొచ్చని చెబుతున్నారు. తమ సినిమాలోనే జెనీలియా మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.