ఓ సినిమా కోసం ఏ దర్శకుడు చేయని రిస్క్ చేశాడు దర్శకుడు గుణశేఖర్. రుద్రమదేవీ జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు పన్నెండేళ్లు కష్టపడి చరిత్రను తవ్వి పక్కా ప్రణాళికతో స్క్రిప్ట్ ను రచించుకున్నాడు. మధ్యలో ఎన్ని సమస్యలు వచ్చినా వెనక్కి చూడలేదు. ఆస్తులు అమ్ముకుని రుద్రమదేవిని తెరకెక్కించాడు. అయితే లీడ్ రోల్ రుద్రమ్మగా అనుష్క కంటే బందిపోటుగా గోనా గన్నారెడ్డి పాత్ర చేసిన అల్లు అర్జునే చిత్రానికి హైలెట్ గా నిలిచింది. పచ్చిగా చెప్పాలంటే సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్లిందే బన్నీ మూలంగా. ఇక రుద్రమ సక్సెస్ మీట్ లో చిత్రానికి సీక్వెల్ ఉంటుందని, కాకతీయుల చివరి వారసుడు ప్రతాపరుద్రుడి జీవితకథ ఆధారంగా ఇది ఉండబోతుందని హింట్ ఇచ్చాడు గుణ. అయితే రుద్రమ్మ టైంలో ఆర్థిక సమస్యలను చవిచూసిన గుణ ఈ సీక్వెల్ ఆలోచనను విరమించుకోవచ్చనే వార్తలు షికారు చేశాయి. కానీ, అలాంటిదేం లేదని తెలుస్తోంది.
ఈ సీక్వెల్ పనులను గుణ శేఖర్ ప్రారంభించాడంట. ఇందుకోసం 'ప్రతాపరుద్రుడు' జీవితచరిత్రకి సంబంధించిన విషయాలను పూర్తిస్థాయిలో సేకరించే పనిలో వున్నాడట. ఆ పని సంతృప్తిని కలిగించే స్థాయిలో పూర్తికాగానే, సెట్స్ పైకి తీసుకెళ్తాడని తెలుస్తోంది. 'ప్రతాపరుద్రుడు'గా ప్రేక్షకుల ముందుకు వచ్చే ఆ కథానాయకుడు ఎవరో వేచిచూడాలి. ప్రస్తుతానికైతే ప్రతాపరుద్రుడి చరిత్రకు పట్టిన దుమ్మును దులిపే పనిలో బిజీగా ఉన్నాడు గుణ.