మెగా వారసులు చిరంజీవి మూలాలను వాడుకున్నంతగా వేరే వారసులు ఎవరూ వాడుకోరేమో. కెరీర్ మొదటి నుంచి చిరంజీవి స్టైల్ ను అనుకరిస్తూ వస్తున్న చరణ్ మధ్యలో రీమిక్స్ పాటలను వాడుకుంటున్నాడు. అయితే చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన గ్యాంగ్ లీడర్ ను చెర్రీ రీమేక్ చేస్తాడని ఆమధ్య వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం తనిఒరువన్ పనులతో బిజీగా ఉన్న చరణ్, ఆ తర్వాతి ప్రాజెక్ట్ సుకుమార్ తో అని అనౌన్స్ చేశాడు కూడా. మరి గ్యాంగ్ లీడర్ అటకెక్కినట్లేనా? అదేం కాదంట. కాకపోతే గ్యాంగ్ లీడర్ మరో మెగా వారసుడి చేతికి వెళ్లినట్లు తెలుస్తోంది. మెగా మేనల్లుడిగా సాయిధరమ్ తేజ్ తొలి చిత్రం నుంచే దూకుడు చూపిస్తూ వస్తున్నాడు. వరుస హిట్లతో మాస్ ఆడియన్స్ కి బాగా చేరువైపోతున్నాడు.
ఈ నేపథ్యంలోనే ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ సినిమాకి 'గ్యాంగ్ లీడర్' అనే టైటిల్ పెట్టాలన ఆలోచనలో ఉందట చిత్ర యూనిట్. చిరు లాగే మాస్ లో క్రేజ్ సంపాదించుకునేందుకు సాయి బాగా ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో చిరంజీవి సినిమాల్లోని హిట్ సాంగ్స్ ను రీమిక్స్ చేయడమే కాదు, 'సుప్రీమ్' అంటూ గతంలో ఆయనకి గల బిరుదును కూడా తన నెక్స్ట్ టైటిల్ గా వాడేస్తున్నాడు. ఆ క్రమంలోనే తన తదుపరి చిత్రానికి 'గ్యాంగ్ లీడర్' టైటిల్ ను కూడా ఉపయోగించుకోవాలనే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. అయితే దీనిపై చిరు ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. రాంచరణ్ కాకుండా చిరు టైటిల్స్ వేరే వారు వాడుకోవటానికి వీల్లేదని వారి వాదన. ఇప్పటికే సుప్రీం వాడుకుంటున్న ఈ మెగా మేనల్లుడు మరో మాస్ టైటిల్ ను కూడా వాడుకోవటం వారిని కలిచివేస్తుందట. ఈ విషయంలో చరణ్ నుంచి సాయికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు చెబుతున్నప్పటికీ, ఫ్యాన్స్ మాత్రం అస్సలు తగ్గట్లేదని తెలుస్తోంది.