అలనాటి తారల్లో బహు బాషా చిత్రాల్లో నటించిన తారల్లో ఒకరు రాధికా శరత్ కుమార్. దశాబ్దకాలంపాటు తెలుగు లోనే కాదు తమిళ్, మళయాళం, కన్నడం, హిందీ ఇలా అన్ని రంగాల్లో రాణించేసింది. కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, మోహన్ బాబు ఇలా ఆ టైంలో అగ్రతారలతో నటించింది. ముఖ్యంగా చిరంజీవి ఈమె కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు అన్నీ బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. ఈరోజు (ఆగష్టు 21న) ఆమె 52వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె గురించి...
1963 ఆగష్టు 21 న చెన్నైలో గీతా రాధా-ఎం.ఆర్.రాధా దంపతులకు ఆమె జన్మించారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ఆరంభించిన ఆమె చిన్నవయస్సులోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. ఆమె సోదరుడు రాధా రవి, సోదరి నిరోషా కూడా సినీ రంగంలో రాణించారు. రాధిక బహుముఖ ప్రజ్నాశాలి. ఓ వైపు సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు సీరియళ్లు నిర్మించి వాటిల్లో నటించింది కూడా. రాడాన్ మీడియా వర్క్స్ పేరిట ఓవైపు సీరియళ్లు, మరోవైపు సినిమాలు కూడా నిర్మించారు. ఆమె మొదటి వివాహం 1985 లో నటుడు ప్రతాప్ పోతన్ ను చేసుకున్నారు. కానీ, ఏడాదికే వారిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మరో నటుడు రిచర్డ్ హ్యార్డీని వివాహం చేసుకుంది. ఈ బంధం కూడా ఎంతోకాలం నిల్వలేదు. రెండేళ్ల తర్వాత వారిద్దరు విడిపోయారు. వారికి రాయానే హర్డీ అనే కూతురు ఉంది. ఆ తర్వాత చాలా గ్యాప్ తో 2001 లో ప్రముఖ నటుడు శరత్ కుమార్ ను వివాహం చేసుకున్నారు. వీరికి రాహుల్ అనే అబ్బాయి ఉన్నాడు. ప్రస్తుతం ఆమె డజను కు పైగా సీరియళ్లలో, ఓ అరడజన్ చిత్రాల్లో బిజీగా ఉన్నారు. ఆమె ఇలాంటి పుట్టినరోజులు మరిన్నీ జరుపుకోవాలని ఆశిస్తూ... నీహార్ ఆన్ లైన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది.