అంతర్జాతీయ గుర్తింపు పొందిన సౌత్ ఇండియన్ నెంబర్ వన్ డైరెక్టర్ శంకర్ ఒక చేదు సంఘటన ఎదుర్కోవాల్సి వచ్చింది. అది కూడా ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయ రాజా నుంచి. ఇళయ రాజా సంగీతం అందించిన ఒక పాటను శంకర్ తన సినిమాలో వాడుకోవడమే ఈ వివాదానికి కారణం. శంకర్ రెండేళ్ళ క్రితం నిర్మాతగా కూడా మారాడు. తన నిర్మాణకత్వంలో వైభవ్ హీరోగా వచ్చిన ‘కప్పల్’ అనే తమిళ సినిమాలో, ‘కరకాటకరన్’ అనే పాత సినిమాలోని ‘ఊరు వీటు ఊరు వంతు’ అనే పాటను వాడుకున్నారు. ఇళయరాజా పర్మిషన్ తీసుకోకుండా ఈ పాటను శంకర్ వాడుకోవడంతో శంకర్ కు నోటీసు జారీ చేశాడు. తన అనుమతి లేకుండా పాట వాడుకున్నందుకు నష్టపరిహారం చెల్లించాలని ఇళయ రాజా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన శంకర్ ప్రొడక్షన్ కంపెనీ ‘ఎస్ పిక్చర్స్’ వారికి కూడా హెచ్చరిక జారీ చేశారు. ఈ పాటను ‘కప్పల్’ సినిమాలోంచి తీసి వేయకపోతే లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అయితే దీనిపై స్పందించిన ఎస్ పిక్చర్స్ వారు తాము ‘కరకాటకరన్‘ సినిమాలోని పాటల హక్కులు పొంది మార్కెట్ లో విడుదల చేసిన వారి నుంచి లీగల్ పర్మిషన్ పొందిన తరువాతే తమ సినిమాలో ఈ పాటను చేర్చుకున్నట్టు చెబుతున్నారు.