రామ్ చరణ్-శ్రీను వైట్ల కాంబినేషన్ లో డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరించిన ‘బ్రూస్ లీ' సినిమా రేపు (అక్టోబర్ 16)విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా విడుదల సన్నాహాల్లో ఉన్న ఈ చిత్ర బృందానికి షాక్ ఇస్తూ ఆదాయపన్ను శాఖ అధికారులు దర్శకుడు శ్రీను వైట్ల, నిర్మాత డివివి దానయ్య, సంగీత దర్శకుడు తమన్ ఇళ్లపై దాడులు నిర్వహించారు. శ్రీను వైట్ల, డివివి దానయ్య ఇళ్లు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇంకా వివరాలేమీ వెలువడలేదు. ఈ విషయం తెలిసిన రాంచరణ్ షాకైనట్టు తెలుస్తోంది.
ఈ మధ్య కాలంలో భారీ బడ్జెట్ సినిమాల విడుదల ముందు ఐటీ అధికారులు ఆ సినిమాకు సంబంధించిన వారిపై దాడులు చేయడం సర్వసాధారణం అయిపోయింది. ఇటీవల పులి సినిమా విడుదల సమయంలో కూడా ఐటీ అధికారులు హీరో విజయ్ ఇంటిపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ‘బ్రూస్ లీ' చిత్రాన్ని దాదాపు రూ. 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను 2000 స్క్రీన్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అమెరికాలో కూడా భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా విడుదల కానన్ని అత్యధిక స్క్రీన్లలో ‘బ్రూస్ లీ' సినిమా విడుదలవుతోంది.