అర్జున్ సినిమా ఎంపిక కూడా చాలా బాగుంటుంది. ఆయన సినిమాల్లో డిజాస్టర్స్ తక్కువనే చెప్పాలి. నటనలో పూర్తి ఇన్వాల్వ్ మెంట్ కనిపిస్తుంది. తన సరికొత్త స్టైల్, మ్యానరిజంతో తెలుగులో స్టార్ హీరోల్లో ఒకరుగా చాలా తక్కువ సమయంలో పేరు తెచ్చుకున్నాడు. తన కథల ఎంపికలోనూ చాలా వైవిద్యం కనిపిస్తుంది. యాక్టింగ్ పరంగా తనను తాను ఎప్పటికప్పుడు కొత్తగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నాడు. గత సంవత్సరం దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ‘రేసు గుర్రం’ ద్వారా తన స్థాయిని అమాంతం పెంచేసుకుని, ఫిల్మ్‌ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నాడు.
సౌతిండియాలోని సినీ పరిశ్రమలకు సంబంధించి ప్రతిష్టాత్మక ఫిల్మ్‌ఫేర్ అవార్డులను నిన్న సాయంత్రం ప్రకటించారు. నాలుగు భాషల సినీ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో 2014లో విడుదలైన సినిమాల్లో వివిధ క్యాటగిరీల్లో టాప్ సినిమాలు పోటీలో నిలిచాయి. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఉత్తమ నటుడు అవార్డును స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సొంతం చేసుకున్నాడు. అంతకు ముందు అర్జున్ ‘పరుగు’, ‘వేదం’ సినిమాలకు ఉత్తమ నటుడుగా అవార్డులను అందుకోగా తాజాగా ‘రేసుగుర్రం’తో ముచ్చటగా మూడోసారి ఈ అవార్డును దక్కించుకున్న హీరో అయ్యాడు. ఇక తనకు ఈ అవార్డు రావడం పట్ల బన్నీ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. “రేసుగుర్రం చిత్రానికి పని చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను... దర్శకుడు సురేందర్ రెడ్డికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ అవార్డును ఇండియన్ సినిమా లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు గారికి అంకితం ఇస్తున్నా”అని తెలిపాడు.