సినీ నటులు ఆపదలో ఉన్న అభిమానులను పరామర్శించడం... సహాయం అందించడం అభినందనీయం. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా నేరుగా వారికి సమాచారం అందుతుండడంతో వెంటనే వారు స్పందిస్తున్నారు. ప్రణాంతక వ్యాధులతో బాధ పడుతున్న వీరికి ఊరట నిస్తున్నారు. ఇది మొదట పవన్ కళ్యాన్ తో మొదలై ఆ తరువాత రాంచరణ్... నేడు ఎన్టీఆర్... ఈ చిన్నారులను కొద్ది క్షణాలైనా ఆనందంలో ముంచెత్తడం నిజంగా ప్రశంసనీయం. జూ ఎన్టీఆర్ క్యాన్సర్ తో పోరాడుతున్న తన అభిమానిని మంగళవారం కలిసి పరామర్శించారు. ఈ అమ్మాయి పేరు శ్రీనిధి. ఈ అమ్మాయికి కేన్సర్ ఫోర్త్ స్టేజ్ లో ఉంది. పదేళ్ళ వయసున్న శ్రీనిధికి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమట. ఈ విషయం జూ ఎన్టీఆర్ కు తెలపడంతో ఆయన వెంటనే తన అభిమానిని కలవాలని, హైదరాబాద్ కూకట్ పల్లిలోని రాందేవ్ ఆసుపత్రికి చేరుకుని, చికిత్స పొందుతున్న ఆమెను కలిసి మాట్లాడాడు. వరంగల్ జిల్లాకు చెందిన శ్రీనిధి తండ్రి గవర్నమెంటు చిరుద్యోగి. కూతురు చికిత్స నిమిత్తం వారు హైదరాబాద్ కు వచ్చారు. శ్రీనిధి కోరికను సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ఎన్టీఆర్ వెంటనే స్పందించి ఆమెను కలుసుకున్నాడు.