సెలబ్రిటీలు సోషల్ మీడియాలో చేసే కామెంట్లు ఎంతటి దుమారాన్ని రేపుతాయో మనందరికీ తెలిసిందే. సాధారణంగా తమ చిత్ర ప్రమోషన్లకు వీటిని ఇప్పుడున్న జనరేషన్ స్టార్లు విచ్చలవిడిగా వాడేస్తున్నారు. అయితే ఒక్కోసారి అభిమానుల వెర్రి తట్టుకోలేని వారు సహనం కోల్పోయి అక్కడే తిట్టేస్తుంటారు కూడా. ఆపై అవి వార్తల్లోకి ఎక్కేయటం కామన్ గా మారింది. వీటిద్వారా ఎంతో ఫ్లస్ ఉందో... అంతే మైనస్ కూడా ఉన్నాయి. హ్యాకింగ్ అనే భూతం దాటికి బడా స్టార్లు సైతం షాక్ తిన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ కూడా ఇందుకు మినహాయింపు ఏం కాదు. ఆ మధ్య ఆయన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కి గురై న్యూడ్ ఫోటోలు దర్శనమివ్వటం తెలిసిందే. అప్రమత్తమైన ఆయన ఆ పోస్ట్ లు తొలగించి తన అభిమానులను వారించాడు కూడా. ప్రస్తుతం ఈ హ్యాకర్ల దాటికి గురైంది మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ అకౌంట్.
అసలేం మైందంటే... నాన్నకు ప్రేమతో చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రయూనిట్ గట్టిగా ఫిక్సయ్యింది. అయితే రిలీజ్ కు సంబంధించి తనకేమీ తెలియదని జూనియర్ ట్విట్టర్ అకౌంట్ ట్వీట్లు కనిపించాయి. ఈ ట్వీట్ వెనువెంటనే డిలీట్ కావడం, మళ్లీ ప్రత్యక్షమవడం వెనువెంటనే జరిగిపోయాయి. దీంతో ఏం జరుగుతుందోనని అభిమానులు కలవరానికి గురయ్యారు. దీనిపై స్పందించిన ఎన్టీఆర్, చిత్ర యూనిట్ చెప్పటంతో అప్రమత్తం అయ్యానని, తన ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కి గురైందని పేర్కొన్నాడు. తన ట్విట్టర్ అకౌంట్ పూర్తిగా తన కంట్రోల్ లోకి వచ్చిన తర్వాత తిరిగి అభిమానులతో మాట్లాడతానంటూ పేర్కొన్నాడు. ఎంత సెక్యూరిటీ ఉన్నా తమ పనితనంతో హ్యాకర్లు చేసే చేష్టలకు సెలబ్రిటీలు తలలు పట్టుకోవాల్సి వస్తోంది.