అఖిల్ సినిమా దసరాకు రిలీజ్ చేయడం వాయిదా పడినందున దసరా బరిలో కంచె దూకేసింది. షేర్ కూడా అదే రోజు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల చేస్తున్నారు. పటాస్ విజయంతో ఉన్న కళ్యాణ్ రామ్ అదే ఉత్సాహంతో షేర్ సినిమా షూటింగ్ చాలా ఫాస్ట్ గా ముగించారు. కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకొని ‘యు/ఏ’ సర్టిఫికేట్ తెచ్చుకుంది. ఈ సినిమాను అక్టోబర్ 30న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి సిద్దమయ్యాడు. ఈ రోజు నుంచి ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్స్ చాలా జోరుగా సాగనున్నాయి. కళ్యాణ్ రామ్ అండ్ టీం ఈ సినిమా కూడా పటాస్ లానే ప్రేక్షకులను మెప్పిస్తుందని ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఎస్ఎస్ తమన్ అందించిన ఆడియోని ఇటీవలే ఎన్.టి.ఆర్ చేతుల మీదుగా లాంచ్ చేసారు. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఉంటూనే ఓ డిఫరెంట్ పాయింట్ ని కూడా టచ్ చేసారట. మల్లికార్జున్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి కొమర వెంకటేష్ నిర్మాత.