‘చీకటి రాజ్యం’ అనగానే కమల్ హాసన్ ‘ఆకలి రాజ్యం’ గుర్తుకు వస్తుంది. ఈ సినిమా కూడా అప్పట్లో చాలా కొత్త కథతో తెరకెక్కింది. ఇప్పుడు చీకటి రాజ్యం గురించి ఎప్పుడూ తన సినిమాల గురించి గొప్పలు చెప్పుకోని కమల్ హాసన్ ఈ సినిమా గురించి గొప్పగా చెప్పుకుంటున్నాడు. షూటింగ్ మొదలుపెట్టకముందు నుంచి ఇది చాలా ప్రత్యేకమైన సినిమా అని చెబుతున్నారు. తన శిష్యుడు రాజేష్ సెల్వ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు తమిళ ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని కలిగిస్తుందని.. రెండు గంటలు తెలియకుండా గడిచిపోతాయని అంటున్నాడ. కేవలం 40 రోజుల్లోనే ‘చీకటి రాజ్యం’ షూటింగ్ పూర్తి చేసిన కమల్ హాసన్ ఈ సినిమా విశేషాల గురించి పాత్రికేయులతో పంచుకున్నాడు. ‘‘చీకటి రాజ్యం ఒక విభిన్నమైన కథతో రూపొందుతున్న చిత్రం. రెండు గంటలు ఎలా గడిచిపోయాయో తెలియనంతగా ఈ సినిమా చూసిన ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటికొస్తారు. తెలుగు సినిమా చేస్తాను అన్న మాట నిలబెట్టుకుంటున్నా. రాజేష్ నా శిష్యుడు. ఏడేళ్లుగా నాతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పటికి తనతో సినిమా చేయడం కుదిరింది. ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాలు ఒకెత్తు. ఈ సినిమా మరో ఎత్తు. ఓ కొత్త పంథాలో సాగే చిత్రమిది. ఓ రాత్రి జరిగే కథ ఇది. నాలుగు విభిన్నమైన పాత్రల చుట్టూ నడుస్తుంది. 40 రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేశాం. జిబ్రాన్ సంగీతం ఆకట్టుకొంటుంది. త్వరలో పాటల్ని విడుదల చేస్తాం'' అని కమల్ చెప్పారు. అబ్బూరి రవి మాటలు అందిస్తున్న ఈ సినిమాలో త్రిష ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సెప్టెంబరులో ఆడియో విడుదల చేసి.. దసరా కానుకగా తమిళ తెలుగు భాషల్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళ వెర్షన్ కు తూంగా వనం (నిద్రిస్తున్న నగరం) అని టైటిల్ పెట్టారు.