కమల్ కి కత్తెర...

May 06, 2015 | 01:23 PM | 130 Views
ప్రింట్ కామెంట్
uthama_villain_sensor_niharonline

‘దశావతారం’, ‘విశ్వరూపం’ వంటి మెస్మరైజింగ్‌ చిత్రాల తర్వాత కమల్‌ హాసన్‌ చేసిన మరో విలక్షణమైన చిత్రం ‘ఉత్తమవిలన్‌’. తిరుపతి బ్రదర్స్‌ ఫిల్మ్‌ మీడియా ప్రై.లి., రాజ్‌కమల్‌ పిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్స్‌పై ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సమర్పణలో రమేష్‌ అరవింద్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సి.కె.ఎంటర్‌టైన్మెంట్స్‌ ప్రై.లి.బ్యానర్‌పై సి.కళ్యాణ్‌ తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది.

ఈ సందర్భంగా హీరో కమల్‌ హాసన్‌ మాట్లాడుతూ ‘‘దశావతారం, విశ్వరూపం వంటి విభిన్న చిత్రాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఆ చిత్రాల తర్వాత మళ్ళీ ప్రేక్షకుల నుంచి అంత మంచి రెస్పాన్స్‌ వస్తోన్న సినిమా ఉత్తమ విలన్‌. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్‌ చేసిన తెలుగు ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ చిత్రంలో మా గురువుగారు కె.బాలచందర్‌గారు, సాగర సంగమం, స్వాతిముత్యం, శుభసంకల్పం వంటి గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించిన కె.విశ్వనాథ్‌గారు ఈ ఇద్దరితో కలిసి నేను ఈ సినిమాలో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ చిత్రంలో నేను చేసిన రెండు పాత్రలకు అద్భుతమైన స్పందన వస్తోంది. నాకు అన్నివిధాలా సంతృప్తినిచ్చిన చిత్రమిది’’ అన్నారు.

నిర్మాత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ ‘‘మా సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌లో తెలుగులో విడుదలైన ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వస్తోంది. అయితే ఈ చిత్రం నిడివి కాస్త ఎక్కువగా వుందని చాలా మంది చెప్పడంతో చిత్రం నిడివిని 21 నిముషాలు తగ్గించడం జరిగింది. రేపటి నుంచి ఈ చిత్రం ప్రదర్శించబడుతున్న అన్ని థియేటర్లలో ట్రిమ్డ్‌ వెర్షన్‌ ప్రదర్శింపబడుతుంది. ఆల్రెడీ ఈ చిత్రాన్ని ప్రేక్షకులు సూపర్‌హిట్‌ చేశారు. రేపటి నుంచి ప్రదర్శింపబడే ట్రిమ్డ్‌ వెర్షన్‌తో సినిమా ఇంకా పెద్ద రేంజ్‌ హిట్‌ అవుతుందన్న నమ్మకం నాకు వుంది. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్‌ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అన్నారు.

కమల్‌హాసన్‌, జయరామ్‌, కె.బాలచందర్‌, నాజర్‌, ఆండ్రియా, పూజా కుమార్‌, పార్వతి మీనన్‌,  పార్వతి నాయర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: కమల్‌హాసన్‌, సంగీతం: ఎం.జిబ్రాన్‌, సినిమాటోగ్రఫీ: శ్యామ్‌దత్‌, ఎడిటింగ్‌: విజయశంకర్‌, సమర్పణ: తిరుపతి బ్రదర్స్‌, ఈరోస్‌ ఇంటర్నేషనల్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: జి.కుమార్‌బాబు, కోప్రొడ్యూసర్‌: సి.వి.రావు, నిర్మాత: సి.కళ్యాణ్‌, దర్శకత్వం: రమేష్‌ అరవింద్‌.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ