ప్రముఖ సినీనటి శృతి హాసన్ను ఏడిపించినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. దీనిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ శనివారం ఈ వార్తను ఖండించారు. తాను శృతి హాసన్ను ఎప్పుడూ ప్రత్యక్షంగా చూడనేలేదు. నేను తనను ఏడిపించడమేమిటని ఆయన ప్రశ్నించారు. తాను తిరుపతి వెళితే కారులోనే వెళతానని అన్నారు. ఒకే ఒక్కసారి సీఎం చంద్రబాబుతో ఫ్లైట్ లో వెళ్ళానని అన్నారు. కనీసం వివరణ అయినా తీసుకోకుండా ఇలా వార్తలు ప్రచురించడం ఏమిటని మంత్రి కామినేని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దీనికి సంబంధించి శుక్రవారం శ్రుతి హాసన్, మంత్రి కామినేని శ్రీనివాస్ ఒకే విమానంలో పక్కపక్క సీట్లలో కూర్చుని ప్రయాణం చేస్తున్నారనీ, మంత్రిగారు గట్టిగా ఫోన్లో మాట్లాడుతుండగా, నెమ్మదిగా మాట్లాడండని శృతి హాసన ఆ మంత్రికి చెప్పినట్టు, దాంతో మంత్రిగారు ఆగ్రహంతో మేం ప్రజా ప్రతినిధులం మేం గట్టిగానే మాట్లాడతాం... అని గట్టిగా సమాధానం ఇచ్చారనీ, దీంతో శ్రుతి హాసన్ కన్నీటి పర్యంతమైందన్నది ఓ వార్తా కథనం. ఈ విషయాన్ని పలు ఛానళ్ళు కూడా ప్రసారం చేశాయి. దీంతో స్పందించి కామినేని శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. కట్టు కథలని కొట్టి పారేశారు.