బాలీవుడ్ సినిమా పెద్ద కుటుంబంగా కపూర్ ఫామిలీని చెప్పుకోవచ్చు. ప్రుధ్వీ రాజ్ కపూర్ అందించిన ఈ నుంచి వచ్చిన నటి కరిష్మా కపూర్. ఒక దశలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న ఈ భామ పెళ్ళి తరువాత తెరకు దూరమైంది. రెండో ఇన్నింగ్స్ పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేసింది కానీ అవి బెడిసికొట్టాయి. దాంతో మూవీల మీద అంతగా దృష్టి సారించకుండా కొన్ని ప్రైవేట్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా చెలామణి అవుతోంది. ఈ క్రమంలోనే ఈమె వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న నీరూస్ స్టోర్స్ ఓపెనింగ్ వేడుకకు శుక్రవారం హైదరాబాద్ తరలి వచ్చింది. ఈ సందర్భంగా కరీష్మా హైదరాబాద్ కల్చర్, ఇక్కడి మహిళలు ఔన్నత్యంపై తన అభిప్రాయాలను వెల్లడించింది. ‘ముంబైలాంటి మెట్రో సిటీస్‌లో వెస్ట్రన్ కల్చర్ ఫాలో అయ్యే యూత్ సహజంగా వుంటారు కానీ హైదరాబాద్ లేడీస్ వెస్ట్రన్ స్టైల్స్ ని ఎంత ఫాలో అవుతారో.. ట్రెడిషనల్ వేర్‌ని అంతే ఇష్టపడతారు. షూటింగ్ పర్పస్ కన్నా ఏదో ఒక మాల్ లేక ఇతర ఓపెనింగ్స్‌కి హైదరాబాద్‌కి తరచూ వస్తూనే వున్నాను. కార్లో వెళ్లేటప్పుడూ చుట్టూ గమనిస్తుంటా. ఇంతపెద్ద మెట్రో సిటీలో కూడా అమ్మాయిలు చాలా ట్రెడిషనల్‌గా కనిపించడం చూసి ఎంతో ముచ్చటేస్తుంది. నేనూ అంతే... ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమతో ముడిపడి వున్నప్పటికీ.. వెస్ట్రన్ వేర్‌ను ఎంత ఇష్టపడతానో... భారతీయ సంస్కృతి సంప్రదాయాలను అంతే గౌరవిస్తాను’ అని ఆనందంగా చెప్పుకొచ్చింది. అలాగే అమ్మాయిల గురించి తన అభిప్రాయం వెల్లడిస్తూ.. ‘అమ్మాయి అంటే ఫెమినిటీ మిస్సవ్వకుండానే.. మగవాళ్లకు ఏ రకంగానూ తీసిపోము అని ప్రతిబింబించేలా ఉండాలని కోరుకుంటాను. అలా ఉన్నవాళ్లను చూసినప్పుడు ఆడపిల్లగా పుట్టినందుకు గర్వపడతాను. మరో జన్మంటూ ఉంటే ఆడపిల్లగా పుట్టడానికే ఇష్టపడతాను. ఇక వేరే దేశాలకు వెళ్లినా.. నేను ఇండియన్ అని తెలిసే విధంగానే నా డ్రెస్సింగ్ ఉంటుంది. వేరే వాళ్లను కలిసినప్పుడు విష్ చేయడానికి ‘హాయ్’, ‘హలో’ కంటే నమస్తేనే ప్రిఫర్ చేస్తాన’ని తెలిపింది. ఇక డ్రెస్సింగ్ విషయంలోనూ తాను చాలా సెన్సిటివ్ గా వుంటానని తెలిపింది. తనకు ఇండో వెస్ట్రన్ వేర్ అంటే ఎంతో ఇష్టమని.. ముఖ్యంగా ఇంగ్లిష్ కలర్స్ అంటే ఎక్కువ ప్రేమ అని కరీష్మా తెలిపింది.