కథ, కథానంతో సంబంధం లేకుండా ప్రస్తుతం కాంబినేషన్లో సినిమా అనుకోగానే టైటిల్ ను ఖారారు చేసేస్తున్నారు ఇప్పటి తరం దర్శకులు. హీరోల క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని టైటిల్ ను అనుకున్నాక స్టోరీని రూపుదిద్దుతూ మెల్లిగా సెట్ల మీదకు వెళ్లిపోతారు. అదే సమయంలో టైటిల్ కు, కథకు సంబంధం లేకపోయినా ఫర్వాలేదు. ఇక ఇలా టైటిల్ విషయంలో ప్రస్తుతం స్టార్ డైరక్టర్ కి పెద్ద షాకే తగిలింది.
అనుష్క ప్రధాన పాత్రధారిణిగా ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ 'రుద్రాక్ష' పేరిట ఓ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. దీనికి దిల్ రాజు, ప్రకాశ్ రాజ్ లు నిర్మాతలు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి కూడా. ఇదిలా ఉండగా ఇదే పేరును ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేసుకుని ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు మరో దర్శకుడు. ఆదితో 'రఫ్' చిత్రాన్ని రూపొందించిన సీహెచ్ సుబ్బారెడ్డి 'రుద్రాక్ష' పేరుతో ఓ చిత్రాన్ని ప్రారంభించాడు. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ డిజైన్ ను కూడా ఆయన తాజాగా రిలీజ్ చేశాడు. ముందుగా టైటిల్ ను అనుకున్న టైంలోనే అటు దిల్ రాజుగానీ, ఇటు ప్రకాశ్ రాజ్ గానీ రిజిస్టర్ చేయించుకుని ఉంటే ఇప్పుడీ సమస్య ఉండేది కాదంటున్నాయి చిత్ర వర్గాలు. దీంతో కృష్ణవంశీకి ఇప్పుడు మరో టైటిల్ ను వెతుక్కోవాల్సిన అవసరం వచ్చింది.