‘కుమారి 21 ఎఫ్’ కథ ఆరేళ్ళుగా సుకుమార్ మనసులో మెదులున్న కథ అట. ఈ కథ సూర్య ప్రతాప్ కు బాగా నచ్చడంతో ఈ సినిమా చేయమని సుకుమార్ ను కోరాడట. అలా ఆరేళ్ళ సినిమా ఇప్పుడు తెరమీదకు రాబోతోంది అన్నారు సుకుమార్. ఈ చిత్రాన్ని ఆయనే సమర్పిస్తూ కథ, స్క్రీన్‌ప్లే కూడా అందిస్తున్నారు. ‘కుమారి 21 ఎఫ్’ సినిమాలో రాజ్ తరుణ్, హేబాపటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకుడు. విజయ్‌కుమార్ బండ్రెడ్డి, థామస్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్‌ను హీరో ఎన్టీఆర్ శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ ‘ఇదొక అందమైన ప్రేమకథ. ఎన్టీఆర్‌కు కథ రాస్తున్న సమయంలో దొకిన చిన్న విరామంలో ఈ చిత్ర కథ రాసాను. ముందు ఈ సినిమాను కొత్త వాళ్లతో చేయాలనుకున్నాను. అయితే నేనే చేస్తానని రాజ్‌తరుణ్ ఈ ప్రాజెక్ట్ లో చోటు దక్కించుకున్నాడు. దేవీశ్రీప్రసాద్, రత్నవేలు ఈ సినిమాకు ఏం చేశారనేది ఆడియో ఫంక్షన్‌లో మాట్లాడతాను. ఇప్పడే చెబితే నాకు కన్నీల్లోస్తాయి’ అన్నారు.
ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘ఒక సినిమా ఫ్లాప్ అయితే ఇలా ఎందుకు తీసారు అని అంతా అనుకుంటారు. సుకుమార్ ఫ్లాప్ సినిమా చేసినా ఆ సినిమాకు రెస్పెక్ట్ వుంటుంది. అలాంటి గొప్ప దర్శకుడు సుకుమార్. ‘కుమార్ 21 ఎఫ్’ సినిమా గురించి తెలిసిన దగ్గరి నుంచి ఎలా వుంటుందో చూడాలన్న ఆసక్తితో టీజర్ లాంచ్‌కు రావడం జరిగింది’ అన్నారు.
దేవీశ్రీప్రసాద్ మాట్లాడుతూ ‘రత్నవేలు, నేను కేవలం సుకుమార్ కోసమే ఈ సినిమా చేస్తున్నాం. అతను ఎంత బ్రిలియెంట్ డైరెక్టరో టీజర్ చూస్తే తెలిసిపోతోంది. సుకుమార్ రాసిన అందమైన కథని అంతే అందంగా సూర్యప్రతాప్ తెరకెక్కించాడు. ఈ సినిమా రాజ్‌తరుణ్‌కు సరికొత్త ఇమేజ్‌ను తెచ్చిపెడుతుంది. ఇదొక విజువల్ మ్యాజిక్. ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్ కెమెరామెన్ రత్నవేలు. ఆయన అందించిన ఛాయాగ్రహణం చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది’ అన్నారు.
ఈ కార్యక్రమంలో దర్శకుడు సూర్యప్రతాప్, కెమెరామెన్ రత్నవేలు, హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ హేబాపటేల్, విజయ్‌కుమార్ బండ్రెడ్డి, థామస్‌రెడ్డి, బి.వి.ఎస్.ఎన్‌పసాద్ తదితరులు పాల్గొన్నారు.