తమిళ తంబీల ఆరాధ్య దైవంగా నటి ఖుష్బూ ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది. అందాల కథానాయికగా అప్పట్లో ఆమె మంచి మార్కులు దక్కించుకుంది. తమిళంతోపాటు అడపాదడపా కొన్ని తెలుగు సినిమాల్లోను కనిపిస్తూ వచ్చింది. ఇక ప్రస్తుతం ఓవైపు సినిమాల పట్ల ఆసక్తిని కనబరుస్తూనే, అక్కడి రాజకీయాల్లో చురుకైన పాత్రను పోషిస్తోంది. అలాంటి ఖుష్బూ నాన్నకు ప్రేమతో సినిమాను ప్రమోట్ చేస్తుంది. ఆమె అందులో నటించలేదు, కనీసం పరోక్షంగా కూడా ఆ చిత్రంతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. మరి అంతలా ఎందుకంటారా? ఆమె యంగ్ టైగర్ డై హర్ట్ ఫ్యాన్ కాబట్టి.
అవునండీ. తెలుగు రాష్ట్రాల్లో తనకి ఇష్టమైన నటుడు ఎవరని అడిగితే తడబడకుండా చెప్పేసింది. జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని, తాను అతనికి వీరాభిమానినని చెప్పుకొచ్చింది. మొదటి నుంచి ఆయన సినిమాలేవీ మిస్ కాకుండా చూస్తుంటానని అంది. ఎన్టీఆర్ తాజా చిత్రం 'నాన్నకు ప్రేమతో' సంక్రాంతికి విడుదల కానుంది. ఆ సినిమాను కూడా తప్పక చూస్తానని ఆమె ట్విట్టర్లో పేర్కొంది. ఈరకంగా తారక్ పై ఉన్న అభిమానంతోనే ఆమె సినిమా ప్రమోషన్ కు పరోక్షంగా సహకరిస్తుందన్నమాట.