తెలుగు మా మూవీ సంఘం ఎన్నికల మాదిరిగానే తమిళ నడిగర్ సంఘం ఎన్నికలు కూడా రసవత్తరం కానున్నాయి. ఇక్కడ కూడా సినిమా కుటుంబం రెండుగా విడిపోయి, విమర్శలు, ప్రతివిమర్శలకు దిగారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఎవరు ఎవరికి మద్దతు ఇవ్వనున్నారనేది చాలా ఆసక్తిగా చర్చలు జరుగుతున్నాయి. సీనియర్ నటుడు శరత్ కుమార్ నేతృత్వంలో పాతుకుపోయిన కార్యవర్గాన్ని పెకలించేందుకు మన తెలుగు తేజం విశాల్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించే టట్టే కనిపిస్తోంది. శరత్ వర్గం చేసిన అన్యాయాలు, అక్రమాలపై గళమెత్తిన విశాల్ కు మద్దతు ఇచ్చే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే సీనియర్ నటుడు నాజర్, సూర్య కార్తి బ్రదర్స్ తో పాటు చాలా మంది విశాల్ కు మద్దతుగా నిలిచారు. అయితే తన తరం నటీనటులంతా తనకే మద్దతిస్తారని శరత్ కుమార్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. కానీ సడెన్ గా ఒకప్పటి హీరోయిన్ ప్రస్తుత కాంగ్రెస్ నేత ఖుష్బూ విశాల్ కు మద్దతిచ్చి శరత్ కుమార్ కు షాకిచ్చింది. వీరిద్దరికీ ఎప్పటి నుంచో మంచి స్నేహ సంబంధాలున్నాయి. ఆ స్నేహం పక్కనబెట్టేసి నడిగర్ సంఘంలోకి కొత్త రక్తం రావాలంటూ విశాల్ కు మద్దతిచ్చింది ఖుష్బూ. జయలలితను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఖుష్బూ మద్దతు తీసుకోవడం విశాల్ కు మంచి చేస్తుందో చెడు చేస్తుందో చెప్పలేం. ఆ సంగతి పక్కనబెడితే.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చాలా అగ్రెసివ్ గా ముందుకెళ్తున్నాడు విశాల్. నడిగర్ సంఘం నిధుల్ని దుర్వినియోగం చేయడం.. శివాజీ గణేశన్ విగ్రహం కోసం ప్రభుత్వం దశాబ్దంన్నర కిందటే భూమి ఇచ్చినా పనులు మొదలుపెట్టకపోవడంపై ఈ మధ్యే ప్రెస్ మీట్ పెట్టి శరత్ వర్గాన్ని వాయించేశాడట విశాల్.