నైటింగేల్ అఫ్ ఇండియా బిరుదు పొందిన మన భరతమాత ముద్దు బిడ్డ లతా మంగేష్కర్. ఈమె 1942 నుంచి తన గానామృతంతో భారతీయుల వీనులకు విందు చేస్తున్నారు. మహల్ అనే సినిమాలో ఆయేగా ఆయేగా ఆయేగా ఆనేవాలా అనే పాటతో మొదటి సారి తన గళాన్ని విప్పారు. తన 86 ఏళ్ళ కళా ప్రయాణంలో ఇప్పటికి 980 సినిమాల్లో 20 భాషలలో 50 వేలకు పైగా పాటలు పాడారు. అందుకే ఈమెకు భారత ప్రభుత్వం భారత రత్న పురస్కారాన్నిచ్చి సత్కరించింది.
లతా మంగేష్కర్ 13 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు తండ్రి దీనానాథ్ (ఈయన కూడా సంగీత విధ్వాంసుడు) మరణించడంతో కుటుంబ భారాన్ని మోయవలసి వచ్చింది. 1942 మరాఠీ చిత్రం పహ్లా మంగళ గౌర్ లో కథానాయికకు చెల్లెలుగా నటించి, రెండు పాటలు పాడింది. ఆ తరువాత కూడా మరో నాలుగు చిత్రాల్లో నటించి తన పాటలు తనే పాడుకుంది. అప్పట్లో సీనియర్ గాయనీ మణులు ఖుర్షీద్, నూర్జహాన్, సరయ్యాలు గాయనీ మణులుగా చలామణి అవుతున్నారు. వారికి పోటీగా లతా మంగేష్కర్ గాయనిగా రాణించింది. ఆర్.డి.బర్మన్, లక్ష్మీకాంత్-ప్యారేలాల్, కళ్యాణ్ జీ-అనంద్ జీ, తర్వాత బప్పీలహరి, రాంలక్ష్మణ్ వంటి హేమా హేమీలైన సంగీత దర్శకత్వంలో ఎన్నో పాటలు పాడి, ఇప్పటి ఏ.ఆర్. రెహమాన్ సంగీతంలో కూడా తన గానంతో శ్రోతలను ఓలలాడించింది. అయితే ఓ.పి.నయ్యర్ మాత్రం లతను కాదని ఆషా భోంస్లే కంఠాన్ని దాదాపు లతకు పోటీగా తీసుకు వెళ్ళారు. అప్పట్లో అక్కా చెల్లెళ్ళకు వృత్తి రీత్యా తీవ్ర పోటీ ఉండేదని చెప్పుకునే వారు. ఈమె నిర్మాతగా కూడా మారి మరాఠీలో, హిందీలో కొన్ని చిత్రాల్ని కూడా నిర్మించారు. సంగీత దర్శకురాలిగా కూడా కొన్ని సినిమాలకు సంగీతాన్ని సమకూర్చారు.
1978 నాటికి లతా మంగేష్కర్ 30 వేలకు పైగా పాటలు పాడిన ఏకైక గాయనిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఈమె పేరు నమోదైంది. అప్పట్లోనే ఈమె గానకోకిల అనే బిరుదును సొంతం చేసుకొంది. ఈమె తెలుగులో సంతానం (నిదురపోరా తమ్ముడా, సుసర్ల దక్షిణామూర్తి), ఆఖరి పోరాటం (తెల్లచీరకు, ఇళయ రాజా) రెండు పాటలు పాడారు. 1959 లో టైం మేగజైన్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ప్లే బ్యాక్ సింగర్ కొనియాడింది. భారత ప్రభుత్వం నుండి ఎన్నో అత్యుత్తమ పురస్కారాలు అందుకున్న అరుదైన గాయకురాలు లతా మంగేష్కర్. ఈ సంవత్సరం జనరవరిలో లతా మంగేష్కర్ కు పీ బీ శ్రీనివాస్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డును ఇచ్చి సత్కరించారు .లతాజీతో కలిసి పాట పాడిన తొలి తెలుగు గాయకుడు స్వర్గీయ పిబి శ్రీనివాస్(1964: చందా సె హోగా ఓ ప్యారా (మై బీ లడ్కీ హు). ఆ తరువాత బాలసుబ్రహ్మమణ్యం లతాజీతో యుగళ గీతాలు చాలా పాడారు. ఆమె తెలుగులో పాడినవి రెండు పాటలే అయినా... ఆమె పాడిన నిద్దురపో... తమ్ముడా పాట చిరస్మరణీయం.
ఆమె 2013లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తానిక పాడలేనని సభా ముఖంగా తెలియజేశారు. ‘పాటల్లో చాలా మార్పులు వచ్చాయి. మార్పు సహజమే అయినా, తను పాడ్డం తనకే సంతృప్తిగా లేద’ని అన్నారు. ఆమె ఏడు దశాబ్దాల పాటల ప్రయాణానికి స్వస్తి పలికారు. 1929, సెప్టెంబర్ 28 జన్మించిన లతా మంగేష్కర్ 87 ఏళ్ళ వయస్సులో అడుగు పెట్టారు. ఆమె నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ నీహార్ ఆన్ లైన్ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతోంది.