ఏక్ దో తీన్ చార్ పాంచ్ చే అంటూ నిన్న మొన్ననే గంతులేసిన ఈ తార అప్పుడే 48లో పడింది. అయినా ఈ వయసు తననేమీ ఇబ్బంది పెట్టదంటోంది ఈ భామ. టాలెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చునంటోంది ఈ అందాల రాణి మాధురి దీక్షిత్. ‘డాన్సింగ్ విత్ మాధురి సెకండ్ వెర్షన్’, మొబైల్ యాప్‑ను మొదలుపెట్టడమే తన బర్త్‑డే గిప్ట్ అని మురిసిపోతోంది. తన డాన్సులతో అభిమానుల గుండెల్లో గుబులు రేపిన మాధురి శుక్రవారం తన 48వ పుట్టినరోజును జరుపుకుంది. ఈ సందర్భంగా తనకు అన్ని వేళలా అండగా నిలిచిన కుటుంబ సభ్యులకు మాధురి ధన్యవాదాలు తెలిపింది. ఇప్పటికే ఆన్ లైన్ లో మాధురి డాన్సింగ్ అకాడమీ విజయవంతంగా నడుస్తున్న విషయం తెలిసిందే. గడప గడపకూ తన డాన్స్ ను తీసుకు వెళ్లాలన్నదే తన లక్ష్యమని, తన అకాడెమీ ద్వారా డాన్స్ నేర్చుకోవాలనుకునే వారికి మేలు జరిగితే అంతే చాలునని మాధురి తెలిపింది. 1967 మే 15న పుట్టిన మాధురీ దీక్షిత్ 1984లో సినీ రంగంలోకి అడుగు పెట్టింది. అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ గా రాణించిన ఈమె పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైనా తన సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ తెరమీదకు వచ్చింది. తేజాబ్, రామ లఖన్, దిల్, అమ్ ఆప్ హై కౌన్, దేవదాసు. తన కెరీర్ లో ఎంతో ఎత్తుకు ఎదిగిన మాధురి 2008లో పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకుంది.