మన తెలుగు సినిమాల్లో ఒక్కో పాట షూట్ చేయడానికి భారీ ఖర్చు చేయడం ఇప్పటిది కాదు... రాఘవేందర్ రావు సినిమాల్లో అయితే... పాటల కోసం లారీలకు లారీలు పూలూ, పళ్ళు షూటింగ్ స్పాట్ కు దిగి పోయేవి... ఇవి కూడా పెద్ద ఖర్చుకాదనుకోండి... ఇప్పటి ఖర్చులు చూస్తుంటే. ఒక్కో పాటకు విదేశాలకు వెళ్ళి రిచ్ లొకేషన్లలో షూట్ చేస్తున్నారు.
లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే బ్రహ్మోత్సవంలో మహేష్ బాబు పాటకు దాదాపు మూడున్నరకోట్లు ఖర్చు పెడుతున్నారట. ఆ మధ్య అమీర్ ఖాన్ సినిమా ‘ధూమ్-3’లో ఓ పాట కోసం ఐదు కోట్లు ఖర్చు పెట్టారంటేనే అందరూ అమ్మో అనుకున్నారు. మనదగ్గరా ఓ పాటకు మూడున్నర కోట్లు ఖర్చు చేస్తున్నారంటే టాలీవుడ్ లో చర్చనీయాంశం అవుతోంది. ఐతే మహేష్ బాబు బాక్సాఫీస్ స్టామినా ఏంటో బాగా తెలిసిన పీవీపీ సంస్థ మరో ఆలోచన లేకుండా భారీ ఖర్చు పెట్టేసింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న కొత్త సినిమా ‘బ్రహ్మోత్సవం’ నేరుగా పాటతో షూటింగ్ ఆరంభించారు. రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్లో ఈ పాటను చిత్రీకిరించారు. ఈ సెట్టింగుని రెండు నెలలు కష్టపడి రూపొందించారు. ఇక పాట చిత్రీకరణ కూడా భారీగానే సాగిందట. ఐదొందల మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు ఆ పాటలో పాల్గొన్నారు. అదో వివాహ వేడుకకు సంబంధించిన పాట. చిత్ర యూనిట్ సభ్యులందరూ కూడా అందులో సందడి చేశారు. తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత భారీగా తెరకెక్కిన పాట ఇది.