కొంపదీసి సూపర్ స్టార్ రజనీకాంత్ స్వీయంగా నటించిన చిత్రం అనుకుంటున్నారా? అదేం కాదులేండి. మ్యాటరేంటంటే... బాలీవుడ్ లో మైహూ రజనీకాంత్ అనే ఓ చిత్రం వచ్చింది. తమిళ, తెలుగు చిత్రాలలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసే ఆదిత్యామీనన్ ఈ చిత్రంలో హీరోగా నటించగా, పైసల్ సైఫ్ దర్శకత్వం వహించాడు. అది అక్కడ పెద్దగా ఆడలేదు. కానీ, ఆదిత్యమీనన్ కి తమిళనాట కాస్త క్రేజ్ ఉండటం, పైగా టైటిల్ లో రజనీ పేరు ఉండటాన్ని వాడుకోవాలనుకొని ఈ చిత్రాన్ని అక్కడ విడుదల చేయడానికి నిర్మాత సూరజ్ ప్రయత్నాలు ప్రారంభించాడట. అయితే ఈ చిత్రం తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ఉందని పేర్కొంటూ ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంతే చెన్నై హైకోర్టులో పిటీషన్ దాఖలుచేశారు. ఈ చిత్రం విడుదలపై నిషేధం విధించాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. అక్కడ తీర్పు రజనీకే అనుకూలంగా వచ్చింది. దీంతో మైహూన్ రజనీకాంత్ చిత్ర నిర్మాత సుప్రీం కోర్టుకు అప్పీల్ చేయడానికి సిద్ధమయ్యారట. ఒక చిత్ర కథకుడిగా, దర్శకుడిగా రజనీకాంత్‌ను అవమానించాలని తాను భావించలేదని దర్శకుడు పైసల్ సైఫ్ వెల్లడించాడు. అయితే టైటిల్ మార్చాలని నిర్ణయించామని, అయితే నిర్మాత మాత్రం న్యాయ పోరాటానికే మొగ్గుచూపుతున్నాడని ఆయన తెలిపాడు.