అల్లు అయాన్ తరువాతి బుజ్జి సెలబ్రిటీ ఎవరయ్యా అంటే మంచు లక్ష్మి కూతురు విద్యా నిర్వాణ అని చెప్పుకోవచ్చు. ఈ అమ్మడు కూడా సోషల్ నెట్వర్క్ లో ప్రతి అకేషన్ కూ అందరినీ పలకరిస్తోంది. ఇటీవల అమ్మతో కలిసి మామ పెళ్ళికి ఆహ్వానించింది. అయితే మంచు లక్ష్మి-అడవి శేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘దొంగాట' సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. మంచు లక్ష్మి స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు గౌతమ్ మీనన్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన వంశీ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం మంచు లక్ష్మి చిట్టి కూతురు విద్యా నిర్వాణ సమర్ఫణలో విడుదలవుతోంది. సెన్సార్ యూ/ఏ సర్టిఫికేట్ కూడా పొందింది. ఈ సినిమా గురించి మంచు లక్ష్మి వివరిస్తూ...‘‘నా కెరీర్లో మొదటిసారి నటించిన వినోదప్రధాన చిత్రం దొంగాట. ఇందులో నేను సినిమా హీరోయిన్ పాత్రలో కనిపిస్తాను. అనూహ్య పరిస్థితుల్లో నన్ను కొందరు కిడ్నాప్ చేస్తారు. అసలు ఆ కిడ్నాప్ వెనకున్న సూత్రధారులెవ్వరు? ఏం ఆశించి వారు నన్ను కిడ్నాప్ చేశారు? అనే అంశాల చుట్టూ కథ నడుస్తుంది. ఎలాంటి సినిమాలు తీసినా అందులో ఏదో ఒక సందేశం వుండాలన్న సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. దొంగాట చిత్రంలో మనిషికి, డబ్బుకు మధ్యనున్న సంబంధాన్ని తాత్విక కోణంలో తెలియజెప్పే ప్రయత్నం చేశాం. అనుకున్న బడ్జెట్లో ఈ సినిమా తీయడం ఎంతో సంతృప్తినిచ్చిం’’దని తెలుపుతూ తన పాప తన జీవితంలోకి వచ్చిన తర్వాత కొత్త ప్రపంచాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతోందనీ, తన ప్రేమలో నేను ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తున్నానననీ, వీలైనంత సమయాన్ని పాపతో గడపడానికి కేటాయిస్తానని అనానరు. తను పెద్దయ్యాక తనని కూడా సినీరంగంలోకి తీసుకొస్తాననీ, తనను హీరోయిన్ చేయాలనేది తన కోరిక అని మంచు లక్ష్మి చెప్పుకున్నారు.