28 ఏళ్ళ క్రితం మంచి కథతో కమల్ హాసన్ హీరోగా నాయకుడు సినిమాను మణిరత్నం తెర కెక్కించారు. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ సినిమా రాలేదు. ఈ సినిమా తరువాత దాదాపు ఇలాంటి కథలతో సినిమాలు పుంఖాను పుంఖాలుగా వచ్చాయి. కానీ ఏ సినిమా దీన్ని బీట్ చేయలేకపోయింది. తమిళంలో నాయగన్ పేరిట తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో నాయకుడు పేరిట డబ్ చేసి రిలీజ్ చేశారు. యాక్టింగ్, స్టోరీ, డైరెక్షన్ ఇలా అన్ని అంశాల్లోనూ అభిమానుల్ని ఆకట్టుకుంది. సినిమా విడుదలై ఇప్పటికే 28 ఏళ్లు గడిచిపోయింది. నాయకుడు సినిమా చూసిన అప్పటి అభిమానులని ఇప్పటివరకు వేధిస్తున్న ప్రశ్న ఒకటుంది. ఆకట్టుకునే కథ, కథనంతో సినిమా తీసిన ఈ ఇద్దరు ఆ తర్వాత మళ్లీ మరే ఇతర సినిమాకు ఎందుకు కలిసి పనిచేయలేదు అని. 'నాయకుడు' సక్సెస్ తర్వాత వీళ్లిద్దరి మధ్య తేడాలొచ్చాయని..... అందుకే సినిమాలు చేయలేదని కొన్ని పుకార్లు కూడా వీరిద్దరి మీద ఉన్నాయి. కానీ వీరిద్దరికీ అలాంటి మనస్పర్థలు ఉన్నట్టు ఎప్పుడూ కనిపించలేదు. అయితే ఆ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే బాగుండునని అనుకుంటున్న వాళ్లందరి కోరిక తీరబోతున్నట్టు తెలుస్తోంది. చెన్నై ఫిలింనగర్ హల్ చల్ చేస్తున్న ఈ వార్త, కమల్ తూంగవనం అనే సినిమాని పూర్తి చేసుకున్న తర్వాత మణి రత్నం దర్శకత్వంలో నటిస్తాడని సమాచారం. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తమకున్న ఇమేజ్‌ని క్యాష్ చేసుకునేందుకుగాను ఈ సినిమాని ఆ మూడు భాషల్లో విడుదలయ్యేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారట. ఇక వీరిద్దరి కాంబినేషన్ అంటే... ఆ సినిమా ఎలా ఉంటుందనేది అభిమానులు ఇప్పటినుంచే ఊహాగాలు చేయడం సహజమే కదా...