మణిరత్నం వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన అతన్ని హీరోగా పెట్టి సినిమా చేస్తున్నాడట మణిరత్నం. మణిరత్నం సినిమాలన్నీ చాలా సెలెక్టివ్ గా ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన సినిమాలో నటించడమంటేనే చాలా అదృష్టంగా భావిస్తారందరూ. ఎన్నో రోజుల తరువాత వచ్చిన మణిరత్నం సినిమా ‘ఓకే బంగారం’ సినిమా ఇంతకు ముందు సినిమాలంత హిట్ కాకపోయినా, ఇప్పటి ట్రెండ్ కి కాస్త ఆలోచింపదగిన సినిమా ఇది. ఈ సినిమా ఇచ్చిన ఎనర్జీతో మణిరత్నం తన తదుపరి చిత్రం కోసం సిద్దమవుతున్నాడు. అది కూడా తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన జూనియర్ తో సినిమా చేసే ఆలోచనలో ఉండడం విశేషం. ఇంతకీ ఆ అసిస్టెంట్ ఎవరు అనుకుంటున్నారా? ‘ఆవారా’ సినిమాతో తెలుగు, తమిళంలో స్టార్ హీరోగా మారిన కార్తీ. కార్తీ హీరోగా రాకముందు మణిరత్నం వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడట. యువ సినిమాకు ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. కానీ అనుకోకుండా కార్తీ హీరో అయ్యాడు. అయితే ఇప్పుడు మణిరత్నం చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో కార్తీ ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. మణిరత్నం ఒకేసారి తమిళ్ – మలయాళ భాషల్లో ఈ సినిమా చేయనున్నారు. ఈ ద్విభాషా చిత్రం మలయాళ వెర్షన్ లో మమ్ముట్టి ఓ మెయిన్ రోల్ లో కనిపించనున్నాడు. ఎప్పటిలానే ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించబోతున్నాడట. గతంలో మణిరత్నం తన దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన సిద్దార్థ్ తో యువ సినిమా చేసాడు. ఇప్పుడు మరో అసిస్టెంట్ కార్తీ తో సినిమా చేయడం విశేషం.