ఛార్మి ప్రధాన పాత్రలో నిర్మించిన 'మంత్ర' ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు అలాంటిదే మరో కథతో 'మంత్ర 2' చిత్రం విడుదలకు సిద్ధమైంది. శ్రీనివాస నాయుడు చేమకూరి సమర్పణలో గ్రీన్ మూవీస్ పతాకంపై పి.శౌరి రెడ్డి, వి.యాదగిరి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్వి సతీష్ దర్శకుడు. చేతన్ హీరోగా నటించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. శుక్రవారం ఈ చిత్రం ఆడియో హైదరాబాద్లో విడుదలైంది. ఈ కార్యక్రమానికి ఛార్మి, చేతన్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రిలయన్స్ సంజీవ్, శివకుమార్, రఫీ, భాస్కరభట్ల, సునీల్ కశ్యప్, ప్రసన్న కుమార్ తదితరులు హాజరయ్యారు.
ఢిల్లీ రాజేశ్వరి, చేతన్, రఫీ సంయుక్తంగా ధియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. ఛార్మి తల్లి భూం భూం వీడియో సాంగ్ విడుదల చేశారు. ప్రసన్నకుమార్ ఆడియో సిడిలను ఆవిష్కరించారు.
అనంతరం ఛార్మి మాట్లాడుతూ.. మంత్ర విజయం తర్వాత పలువురు దర్శకులు సీక్వెల్ తీస్తామంటూ కథలతో వచ్చారు. నేను ఒప్పుకోలేదు. 'మంత్ర 2' అంటే ప్రేక్షకులలో అంచనాలు ఉంటాయి. ఈ సినిమా దర్శకనిర్మాతలు చెప్పిన కథ నచ్చింది. కానీ, మంత్ర 2 టైటిల్ పెట్టొద్దని చెప్పాను. చాలా కాన్ఫిడెంట్ గా అభిమానుల అంచనాలను చేరుకుంటామని చెప్పారు. సినిమా విజయం సాధించినా, పరాజయం పాలైనా వారిదే భాద్యత. ఈ సినిమాకు పాట అవసరం లేదు. అభిమానుల కోసం చేశాం. సునీల్ కశ్యప్ మంచి సాంగ్ కంపోజ్ చేశాడు. అని అన్నారు.
దర్శకుడు సతీష్ మాట్లాడుతూ.. ఫస్ట్ సిట్టింగ్ లో ఛార్మి కథను ఓకే చేశారు. ఆ తర్వాత సినిమా తీయడానికి భయపడ్డాను. రేపు థియేటర్లలో మీకు ఆ భయం కనపడుతుంది. చేతన్, టెక్నీషియన్లు అందరూ ఎంతో సహకరించారు. నిర్మాతలు అన్ని సమకూర్చారు. అని అన్నారు.
భాస్కరభట్ల మాట్లాడుతూ.. సినిమాలో ఒక్క పాట రాయడం హ్యాపీగా ఉంది. ఒక్క పాట రాయడానికి చాలా కష్టపడాలి. ఎక్కువ ఫోకస్ చేయాలి. మంత్రలో మహా మహా ఎంత పాపులర్ అయ్యిందో మీకు తెలుసు. ఈ పాట కూడా సూపర్ హిట్ అవుతుందని అన్నారు.
సునీల్ కశ్యప్ మాట్లాడుతూ.. పాట చేయడానికి నెర్వస్ గా ఫీలవలేదు. కొండంత అండ పూరి గారు, తర్వాత ఛార్మి గారు ఉన్నారు. వాళ్లకు పాట నచ్చింది, నాకు కూడా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.