నయనతార మాయ అనే ఓ హార్రర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్ గా పెద్ద హీరోల సరసన నటించిన ఈ తార ఓ హారర్ మూవీలో నటించడం ఆలోచించాల్సిన విషయం. ఈ కంటెంట్ ఎంతో వెరైటీగా ఉంటేగానీ ఈ టాప్ హీరోయిన్ ఇందులో నటించడానికి ఒప్పుకోదని తమిళ ఫిల్మ్ క్రిటిక్స్ భావిస్తున్నారట. అయితే ఈ చిత్రాన్ని తెలుగులోనూ ‘మయూరి’ పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషలలో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన తమిళ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అశ్విన్ శరవణన్ అనే 24 ఏళ్ళ కుర్రాడు ఈ చిత్రానికి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాకు తెలుగులో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ విడుదల చేస్తున్నారు. ఇంకో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే శ్రీమంతుడు సినిమాకు ఇంటర్ వెల్ లో ఈ ట్రైలర్ ను ప్రదర్శించబోతున్నారట. బుధవారం సి. కళ్యాణ్ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ‘‘ఇది ఆద్యంతం ఊపిరి బిగపట్టించే సూపర్ నేచురల్ థ్రిల్లర్. ఓ పసిపాప తల్లిగా నయనతార ఈ చిత్రంలో కనిపిస్తుంది. కథ ఆమె కేరక్టర్ చుట్టూనే తిరుగుతుంటుంది. ఆమె కెరీర్ లో ఇది ఓ బెస్ట్ పిక్చర్ అవుతుంది. ఈ సినిమాను ‘శ్రీమంతుడు’ సినిమా ఆడే థియేటర్లలో ట్రైలర్ ను ప్రదర్శించబోతున్నాం. ఆగస్టు మూడో వారంలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ఇప్పటివరకూ గ్లామర్ తో పాటు సీరియస్ ఎమోషన్ సీన్లలో చూసిన నయనతారను ఒక హార్రర్ సినిమాలో మొదటిసారి చూడబోతున్నాం. హార్రర్ సినిమాలంటే సస్పెన్స్ ఎక్కువగా క్రియేట్ చేస్తారు కాబట్టి ఎక్కువ శాతం సక్సెస్ అవుతుంటాయి. మరి మయూరి ఎలా ఆకట్టుకుంటుందో వెయిట్ చేయాల్సిందే.