సినిమా టాక్ విషయంలో ఖచ్ఛితంగా ఉంటారు డైలాగ్ కింగ్ నట ప్రపూర్ణ మోహన్ బాబు. తన సినిమా హిట్ అయితే హిట్ అయ్యిందని, ఫట్ అయితే ఫట్ అయ్యిందని మొహమాటం లేకుండా డైరెక్టుగా చెప్పేస్తుంటారు. ఇదే సూత్రాన్ని ఇప్పుడు చిన్న కొడుకు మనోజ్ కూడా ఫాలో అయిపోతున్నాడు. శౌర్య, ఎటాక్ చిత్రాలు అట్టర్ ఫ్లాప్ లు అయ్యాయనే విషయం మీడియా ముందుకు వచ్చి నేరుగా ఒప్పేసున్నాడు. సినిమా సగటు ప్రేక్షకుడికి కూడా నచ్చకపోతే అది వేస్ట్ అనే విషయాన్ని భయపడకుండా చెప్పాలని మోహన్ బాబు చాలా సందర్భాలలో ఓపెన్ గా చెప్పేవారు కూడా. కానీ, మోహన్ బాబు ఇప్పుడు చెప్పే ఓ విషయం మాత్రం అస్సలు నమ్మశక్యంగా లేదు.
జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'ఈడో రకం ఆడో రకం' గురువారం రిలీజై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో రాజ్‌తరుణ్, మంచు విష్ణు హీరోలుగా నటించిన విషయం తెలిసిందే. అయితే తన తనయుడు నటించిన ఈ చిత్రాన్ని డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు చూద్దామనుకుంటే, తాను అనుకున్న సమయంలో టికెట్లు దొరకలేదట. ఈ విషయాన్ని మోహన్‌బాబు ట్విట్టర్ ద్వారా తెలిపారు. శుక్రవారం ఈ సినిమాను చూడాలనుకున్న మోహన్ బాబుకు టికెట్లు దొరకపోవటంతో నిర్మాత రాంబ్రహ్మం సుంకరను అడిగి ఈరోజుకి టికెట్లు తెప్పించుకున్నారట. తన తనయుడు నటించిన సినిమాకి టికెట్లు దొరకకపోవడం, అభిమానుల తాకిడి ఎక్కువవడంతో ఆనందంగా ఉందంటూ ఆయన పేర్కొన్నారు. సినిమా చూద్దామని టికెట్లు కోరిన ఆయనకు ఈరోజు కూడా తాను కోరినన్ని టికెట్లు దొరకలేదని చెప్పారుట. సినిమా ఫలితం యావరేజ్ అని తేలినప్పటికీ పుత్రోత్సాహంతో మోహన్ బాబు చెబుతున్న ఈ విషయం ఎంతవరకు నిజమో ఆయనకే తెలియాలి.