ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి (40) కన్నుమూశారు. గుండె పోటు కారణంగా కొద్దిసేపటి క్రితం ఆయన మృతి చెందారు. చక్రధర్ గిల్లా అలియాస్ చక్రి 1974, జూన్ 15న వరంగల్ జిల్లా మహబూబాబాద్ లో జన్మించారు. పూరి డైరక్షన్ లో బాచి చిత్రం ద్వారా ఆయన సంగీత దర్శకుడిగా టాలీవుడ్ లోకి ఆరంగ్రేటం చేశారు . మొత్తం 85 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన చక్రి, పలు చిత్రాలలో గెస్ట్ అప్పీరియన్స్ చేశారు కూడా. సత్యం సినిమాకు అందించిన సంగీతానికి ఫిల్మ్ ఫేర్ అవార్డును, సింహా చిత్రానికి నంది అవార్డునూ కైవసం చేసుకున్నారు. చక్రి చివరిసారిగా సంగీతం అందించిన చిత్రం దాసరి దర్శకత్వంలో వచ్చిన ఎర్రబస్సు. పలువురు గాయనీ, గాయకులను ఆయన సినీరంగానికి పరిచయం చేశారు. చక్రి అకాల మరణం వార్తతో టాలీవుడ్ దిగ్భ్రాంతిలో కూరుకుపోయింది. చక్రి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే చక్రి తనువు చాలించటం సినీ పరిశ్రమకు తీరని లోటని అన్నారు. తన కెరీర్ లో ఎన్నో విజయాలు సాధించిన తెలంగాణ ముద్దుబిడ్డ చక్రి అని తెలిపారు. చక్రి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. అతని కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలిపారు.