అన్ని భాషా చిత్రాల్లోనూ ఇప్పుడు వారసుల హవా బాగా నడుస్తోంది. దాదాపు అందరు హీరోల సుపుత్రులూ సినీ రంగ ప్రవేశం చేశారు. అదేమిటో మరి... హీరోల వారసులు హీరోలుగా వెలిగిపోతున్నారు గానీ, నిర్మాత దర్శకుల పుత్రులు మాత్రం సక్సెస్ అయిన దాఖలాలు బహు తక్కువ. గోపీ చంద్, నరేష్ లాంటి వారు ఉన్నప్పటికీ పీక్స్ లోకి వెళ్ళ లేక పోయారు. ఇక ఇతర భాషల్లో సినీ కుటుంబంలోని అమ్మాయిలు హీరోయిన్లుగా వెలిగిపోతున్నారు గానీ, మన తెలుగులో మాత్రం ఎవరూ హీరోయిన్లుగా తెరమీద వెలిగిన దాఖలాలు లేవు. అక్కినేని వారి ఫామిలీ నుంచి సుప్రియ ఒక్క సినిమాతో వెనుదిరిగింది. ఘట్టమనేని ఫామిలీ వారమ్మాయి మంజుల తీవ్రంగా ప్రయత్నించింది గానీ చాలా నిరాశపడిపోయింది. ఓ రెండు సినిమాలు సొంతంగా నిర్మించుకుని తృప్తి పడింది. మంచు వారమ్మాయి కూడా కాస్త ఆలస్యంగా వచ్చింది... ఏదో అలా అలా వెలిగిపోతోంది గానీ టాప్ లోకి వెళ్ళ లేకపోయింది... ఇప్పుడు కొణిదెల వారి ఫామిలీ నుంచి వస్తోంది నీహారిక. అమ్మాయి బాగుంటుంది గానీ, మన తెలుగు వాళ్ళు అంత ఈజీగా సినిమాల్లో నటించడానికి ఒప్పుకోరుగా. అలా నిహారిక సినిమాలో నటించడానికి నాగబాబుగానీ, చిరంజీవి ఇద్దరూ ఇష్టపడలేదట. చివరికి ఎక్స్ పోజింగ్ కు దూరంగా, కథ ప్రధానమైన సినిమాలను చేస్తానని నీహారిక ఇంట్లో వారిని ఒప్పించిందని ఓ సమాచారం. ఇప్పుడు ఈ అమ్మాయితో ఓ సొంత సినిమాకు ప్లాన్ చేస్తున్నారట. కథ కోసం చూస్తున్నట్టు తెలుస్తోంది. మంచి కథ కుదిరి నీహారిక అయినా హీరోయిన్ గా టాప్ కు చేరుకుని... తరువాతి తరానికి మార్గం చూపాలని కోరుకుందాం...