ఇప్పుడు ఫిల్మ్ నగర్లో ఎక్కడ చూసినా ఒకటే చర్చ. కొంత మంది నిర్మాతలు, దర్శకులు తెలుగు ఫిల్మ్ చాంబర్లో కొన్ని కొత్త కొత్త టైటిల్స్ ను రిజిస్టర్ చేయించారు. బాగానే ఉంది. మరి వాటికి తగ్గ కథలేవన్నది ఇప్పుడు టాపిక్. ప్రస్తుతం ఒక్కటే ట్రెండ్ నడుస్తుంది. హీరోలను, వారి హీరోయిజాలను దృష్టిలో పెట్టుకుని టైటిళ్లను ఫిక్స్ చేస్తున్నారే తప్ప అవి అసలు కథకు సూటవుతుందా లేదా అన్నది వారసలు పట్టించుకోవటం లేదు. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో స్టార్ రచయిత కమ్ నిర్మాత కోనవెంకట్ శంకరాభరణం చిత్ర టైటిల్ పై క్లారిటీ ఇస్తూ... అసలు చిత్ర కథకు, టైటిల్ కు సంబంధం లేదని, క్యాచీ గా ఉంటుందని మాత్రమే ఈ క్లాసిక్ టైటిల్ వాడుకున్నామని చెప్పుకోచ్చాడు. అంటే కథకు సంబంధం లేకపోయినా కేవలం క్రేజీని తెప్పించటానికే చూస్తున్నారన్న క్లియర్ గా చెప్పేశాడన్నమాట.
ఒక్క కోననే కాదు ప్రస్తుతం టాలీవుడ్ లో అందరూ ఇదే ఫాలో అవుతున్నారు. చిత్రానికి క్లాప్ కొట్టకముందే టైటిళ్లను అనౌన్స్ చేస్తన్నారు. ఇక అప్పటికీ అసలు కథ సిద్ధం కాకపోవటం విశేషం. ఇక ఆ వరుసలో ప్రస్తుతం పెద్ద లిస్టే ఉంది. ఫ్యామిలీ చిత్రాలను అందించే నిర్మాత దిల్ రాజు ' ఫీల్ మై లవ్' అనే ఓ టైటిల్ ను రిజిస్టర్ చేయించాడు. అయితే అందులో నటీనటులు ఎవరో, సాంకేతిక వర్గం ఏమిటో ఇప్పటిదాకా అనౌన్స్ చేయలేదు. ఇక రెబల్ స్టార్ కృష్ణంరాజు దందా పేరుతో ఓ టైటిల్ ను ఫిక్స్ చేయించాడని తెలుస్తోంది. బాహుబలి-2 తర్వాత ప్రభాస్ తో స్వీయ దర్శకత్వంలో చిత్రం చేసేందుకే కృష్ణంరాజు ఈ టైటిల్ ను నమోదు చేసుకున్నాడని తెలుస్తోంది. ఇక క్రిష్ రిజిష్టర్ చేయించిన 'రాయబారి' టైటిల్ అఖిల్ కోసమేనని అనుకుంటున్నారు. అఖిల్ రెండవ సినిమాకి దర్శకుడిగా క్రిష్ ను ఎంచుకున్నారనే వార్తలు ఇటీవల షికారు చేశాయి. వీటిల్లో ఒకదానికి కూడా క్లారిటీ లేదు. మరి ఆయా టైటిల్ విషయమై స్పష్టత దొరికేది ఎప్పుడో?