సినిమా కోసం చియాన్ విక్రమ్ ఎంత కష్టపడతాడో ఐ సినిమాను చూసినవాళ్లకెవ్వరికైనా తెలిసిపోతుంది. పళ్లు, జుట్టు పీకించుకోవటం, క్యారెక్టర్ కోసం శవంలా తయారవ్వటం బహుశా ఏ నటుడు కెరీర్ లో ఇంత రిస్క్ చేసి ఉండడేమో అనిపిస్తుంది. అయితే ఎన్ని ప్రయోగాలు చేస్తున్న విక్రమ్ కి హిట్ పడటం లేదు. అపరిచితుడి తర్వాత అసలు విక్రమ్ హిట్ లేదంటే అతిశయోక్తి కాదు. అయినా వరుస ఆఫర్లు ఆయనను తడుతూనే ఉన్నాయి. ఇక తాజాగా తమిళ్లో విక్రమ్ కథానాయకుడిగా రూపొందనున్న ఒక భారీ చిత్రానికి, టైటిల్ ను మార్చే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంతకు ముందు ఆ చిత్రానికి 'మర్మ మణిదన్' అనే టైటిల్ పెట్టారు. అయితే కొన్ని అవాంతరాల కారణంగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడంలో ఆలస్యమైంది.
ఇక అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధపడుతోన్న ఈ సినిమా యూనిట్, టైటిల్ ను మార్చనున్నట్టు కోలీవుడ్ టాక్. కొత్తగా ఈ సినిమాకి 'మారీశన్' అనే టైటిల్ ను ఖరారు చేసే ఆలోచనలో వున్నారని తెలుస్తోంది. నయనతార కథానాయికగా నటించనున్న ఈ సినిమాలో, విక్రమ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఆయన పోషించనున్న ఒక పాత్ర .. రామాయణంలోని మారీచుడి పాత్రను పోలి ఉంటుందట. అందువల్లనే ఈ సినిమాకి 'మారీశన్' అనే టైటిల్ ను పెట్టాలనుకుంటున్నారని వినికిడి. ఇప్పటికే వరుస పరాజయాలతో డీలాపడిన విక్రమ్ కి, ఈ సినిమా అయినా ఊరట ఇస్తుందేమో.