ఇంతవరకు తన చిత్రం కోసమే పాటలు పాడిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటిసారిగా మరో హీరో కోసం తన గొంతును సవరించుకోబోతున్నాడు. ప్రస్తుతం ఈ విషయమే ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. అది ఎవరికో కాదు పవర్ స్టార్ కోసం. పవర్ స్టార్ అంటే మన పవన్ కళ్యాణ్ కాదులేండి. కన్నడ లో కూడా ఓ పవర్ స్టార్ ఉన్నాడు. కన్నడ స్టార్, స్వర్గీయ రాజ్ కుమార్ తనయుడు పునీత్ రాజ్ కుమార్. అతని సినిమా కోసం మన యంగ్ టైగర్ ఒక పాట పాడబోతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా పునీత్ తన ట్విట్టర్ అకౌంట్లో వెలువరించాడు.
పునీత్ రాజ్ కుమార్ హీరోగా కన్నడలో చక్రవ్యూహ అనే చిత్రం తెరకెక్కుతుంది. ఎన్టీఆర్ తో ఉన్న స్నేహంతో తన చిత్రం కోసం ఓ పాట పాడాల్సిందిగా పునీత్ కోరాడట. అందుకు ఎన్టీఆర్ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం స్పెయిన్ లో నాన్నకు ప్రేమతో షూటింగ్ లో ఉన్న జూనియర్ తిరగొచ్చాకే ఈ అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో యమదొంగ, కంత్రీ, అదుర్స్, రభస ప్రస్తుతం నాన్నకు ప్రేమతో సినిమాల కోసం పాట పాడి అభిమానులను అలరించిన ఎన్టీఆర్ త్వరలో తన గొంతుతో పొరుగు రాష్ట్రంలో కూడా సందడి చేయబోతున్నాడన్న మాట. అన్నట్లు పునీత్ కి చక్రవ్యూహ, ఎన్టీఆర్ కు నాన్నకు ప్రేమతో ఇద్దరికీ ఆయా చిత్రాలు 25వ సినిమాలు కావటం, ఈ రెండు చిత్రాలు సంక్రాంతికే విడుదల అవుతుండటం విశేషం.