ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ ఇద్దరు టాప్ హీరోల ఫ్యాన్స్ మధ్య వివాదం ఇప్పుడు రచ్చ రచ్చ రేపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో తమ అభిమాన హీరోల బ్యానర్ల తొలగింపు వివాదం తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ రెబల్ ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య గత రెండు రోజులుగా అక్కడ పెద్ద యుద్ధమే జరుగుతోంది.
ఈ నెల 2న జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులు భీమవరం పట్టణంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే స్థానిక ఎస్ఆర్కెఆర్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద నుండి అడ్డవంతెన వరకు ఏర్పాటుచేసిన బ్యానర్లను బుధవారం రాత్రి ఎవరో చించేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు స్థానిక అడ్డవంతెన వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. అంతకుముందు బాహుబలి చిత్ర విడుదలను పురస్కరించుకుని ఆ ప్రాంతంలో ప్రభాస్ అభిమానులు భారీ ఫ్లెక్సీలు నెలకొల్పారు. దీంతో అనుమానం వారిపైకి మళ్ళింది. దాంతో ఇరువురు హీరోల అభిమానుల మధ్య ఘర్షణ వాతావారణం తలెత్తింది. ఇక్కడి దాకా బాగానే ఉంది. కానీ, ఈ ఘర్షణ కొత్త మలుపు తిరిగింది. అది రెండు సామాజిక వర్గాల మధ్య వివాదంగా మారే పరిస్థితి దాపురించింది. దాంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా రంగంలోకి దిగారు.
కేవలం ఎవరో ఆకతాయిలు చేసిన పనికి ఇలా ఫ్యాన్స్ పెద్ద భీకర యుద్ధానికే దిగటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇక విషయం తెలుసుకున్న ఇరు వర్గాల పెద్దలు రంగంలోకి దిగి, పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. అభిమానుల్లారా అనవసరమైన విషయాలకి, చిన్న చిన్న విషయాలకు కుల గజ్జిని పులిమి కొట్టుకు చావడం కరెక్టా? ఇదిలా ఉంటే వారిని వారిస్తూ ఈ పెద్ద హీరోలు ఇంత వరకు ఏ ప్రకటన చేయకపోవటమే శోచనీయం.