పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీడియా ప్రతినిధులకు క్షమాపణలు చెప్పాడు. నానక్ రాంగూడలోని రామానాయుడు స్టూడియోలో సర్దార్ షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ కు అమరావతి శంకుస్థాపన ఆహ్వానాన్ని అందించేందుకు ఏపీ మంత్రులు కామినేని, అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ లు వెళ్లారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ బౌన్సర్లు మీడియా ప్రతినిధులపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. దీంతో మీడియా ప్రతినిధులు అక్కడే నిరసనకు దిగారు. తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దీంతో సినిమా గెటప్ లోనే బయటకు వచ్చిన పవన్ కల్యాణ్, మంత్రుల సమక్షంలోనే మీడియాతో మాట్లాడారు. అనుకోకుండా జరిగిన ఘటనకు సంబంధించి తన బౌన్సర్ల తరఫున తాను క్షమాపణ చెబుతున్నానని పవన్ మీడియా ప్రతినిధులకు చెప్పారు. మీడియా వెంట ఇతరులు కూడా స్టూడియోలోకి వస్తుంటారని, ఈ కారణంగానే తన బౌన్సర్లు అడ్డుకుని ఉంటారని ఆయన అన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించిన తర్వాత తన బౌన్సర్ల తప్పిదం ఉంటే వారిపై చర్యలు తీసుకుంటానని ఆయన మీడియా ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బౌన్సర్లు తమపై విరుచుకుపడిన దృశ్యాలను ఓ కెమెరామన్ తన కెమెరాలో చూపించగా, పవన్ ఆసక్తిగా పరిశీలించారు.
రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విడగొట్టారని, నూతన రాజధానిలో అందరూ సంతోషంగా ఉండాలని ఆయన అన్నారు. తాను షూటింగ్ నిమిత్తం గుజరాత్ వెళ్లాల్సి ఉందని, శంకుస్థాపన కార్యక్రమానికి వస్తానో రానో తెలియదని చెప్పారు. సినిమా షూటింగ్‌ను బట్టి శంకుస్థాపన కార్యక్రమానికి తాను రావడమనేది ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు.