తొలిసారిగా ఓ సినీ నటుడిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదైంది. హైదరాబాద్, కాకినాడ పరిధుల్లోని పలు పోలీసు స్టేషన్లలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న హీరో నండూరి ఉదయ్ కిరణ్ పై జూబ్లీహిల్స్ పోలీసులు పీడీ యాక్టును నమోదు చేశారు. 'ఫ్రెండ్స్ బుక్' అనే చిత్రం ద్వారా ఈ ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ప్రస్తుతం చంచల్ గూడా జైలులో ఉన్న ఉదయ్ పై పీడీ చట్టాన్ని నమోదు చేసినట్టు అతనికి నోటీసులు ఇచ్చారు.
మూడు చిత్రాల్లో హీరోగా నటించిన ఉదయ్, గతంలో డ్రగ్స్ కేసుల్లో పట్టుబడ్డ సంగతి తెలిసిందే. వీటితోపాటు దాదాపు 10 కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా హైదరాబాద్ లోని దస్ పల్లా హోటల్ లోని పబ్ లో సిబ్బందిని బెదిరించిన కేసులో రిమాండ్ ఖైదీగా ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. చంచల్ గూడా జైలుకు వెళ్లిన పోలీసు అధికారులు పీడీ యాక్ట్ నోటీసులపై ఉదయ్ సంతకాన్ని తీసుకున్నారు. ఈ చట్టం ప్రకారం కేసు నమోదైతే, కనీసం ఏడాది పాటు చార్జ్ షీట్ తో సంబంధం లేకుండా నిందితుడిని నిర్బంధంలో ఉంచవచ్చు.