విశాఖ తుపాను బాధితుల సహాయార్థం తెలుగు సినీ పరిశ్రమ చేపట్టిన మేముసైతం కార్యక్రమంలో ఒక్కొక్కరు ఏదో ఒక స్కిట్ తో స్టేజీపై అలరించారు. కానీ అక్కినేని నాగార్జున మాత్రం ఈ సహాయాన్ని కాస్త అర్థవంతంగా చూపించదలుచుకున్నారు. తుఫాన్ సమయంలో అక్కడి పరిస్థితులకు స్పందించి సహాయమందించిన, దీనికోసం ఎంతో కష్టపడ్డ రియల్ హీరోలను పిలిపించి వారితో మాట్లాడ్డం నిజంగా ఈ కార్యక్రమానికే హైలెట్. తుఫాను క్లిప్పింగ్స్ మధ్యమధ్యలో చూపిస్తూ, తుపాను వాస్తవ పరిస్థితిని కళ్లకు కట్టినట్టు చూపారు. రియల్ హీరోలలో మొదటి వ్యక్తి ఇన్స్ పెక్టర్ ఆఫ్ కమ్యునికేషన్ శ్యామ్. అతని అసిస్టెంట్ శ్రీనివాస్ సహాయంతో కమ్యూనికేషన్ మెరుగుపరచడం కోసం అతను 36 గంటలు కైలాసగిరిలోనే ఉండిపోయారు. విపత్తు సమయంలో హైసిగ్నలింగ్ వ్యవస్థ పూర్తిగా నాశనం అయినప్పుడు అమెచ్యూర్ రేడియో సిస్టమ్ ద్వారా రామ్మోహన్, హామ్ ఆపరేటర్ ద్వారా 14 ఏళ్ల కుర్రాడు టామ్ అందించిన సాయం గురించి నాగ్ ఇంటర్వ్యూ చేసిన విధానం అందరికీ స్ఫూర్తి కలిగించేలా ఉంది. వారిద్దరు తుఫాను బాధితుల సహాయం కోసం హైదరాబాద్ నుంచి వైజాగ్ ప్రయాణం చేసి వారి కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించి సహాయమందించారు. ఇదే విధంగా మరో స్టూడెంట్ సంస్థ, రేడియో జాకి కూడా తుఫాను బాధితులకు అండగా నిలిచి తమ సహాయాన్ని అందించారు. వీరందరినీ పిలిచి వారు తుఫాను బాధితులకు ఎలా సహాయం అందించారో తెలుసుకుంటూ, చూసే వారందరికీ స్ఫూర్తి కలిగించడం నిజంగా ఒక మంచి ప్రోగ్రామ్ గా దీన్ని అభివర్ణించవచ్చు. ’మేము సైతం’కు సోదరుడు వెంకట్, సోదరి నాగ సుశీలతో సహా మొత్తం అక్కినేని ఫామిలీ అందించిన స్ఫూర్తిదాయక గీతం, రియల్ హీరోస్ రియల్ స్టోరీ ప్రతి ఒక్కరి మనసుకు తాకేలా ఉన్నాయి. చూసేవారికి కంటనీరు తెప్పించాయి. ఇక క్రికెట్ గేమ్ లో అఖిల్ సిక్సర్లకు స్టేడియం ఈలలతో మారుమ్రోగిపోయింది. ఇది మేముసైతంలో అక్కినేని ఫామిలీ అందించిన మెచ్చుతునకలు.