’మిణుగురులు’ అనే తెలుగు సినిమా ఇప్పటికే అనేక జాతీయ అంతర్జాతీయ గౌరవాలను దక్కించుకుంది. ఇప్పుడీ సినిమా ఆస్కార్ స్థాయికి కూడా చేరుకుంది. మిణుగురులు అనేక చిత్రోత్సవాల్లో ప్రదర్శించబడింది. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు కూడా సొంతం చేసుకుంది. అయోధ్యకుమార్ అనే కొత్త దర్శకుడు స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అవార్డుల సినిమా అని ముద్ర పడడంతో అందరికీ చేరువ కాలేకపోయింది. అయితే ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయి మరో గౌరవం దక్కింది. ఈ స్ర్కిప్టును తమ లైబ్రరీలో భద్రపరుస్తామని ఆస్కార్ అకాడమీ సభ్యలు అడిగినట్లు దర్శకుడు అయోధ్య కుమార్ తెలిపారు. ఈ చిత్రాన్ని 87వ ఆస్కార్ అవార్డుల పోటీలో నిలవబోతున్నట్టు చెప్పారు. ఈ స్ర్కిప్టును ఆస్కార్ లైబ్రరీలో పెట్టడం తెలుగు వారికి దక్కిన గౌరవంగా భావిస్తున్నానని దర్శకుడు అయోధ్య కుమార్ తెలిపారు. అయితే ఇలాంటి సినిమాను ప్రేక్షకులు చూసినప్పుడే అసలైన సంతోషం కలుగుతుందనీ, ఇలాంటి సినిమాకు ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహం కల్పించలేదని అన్నారు. కనీసం పన్ను మినహాయింపయినా ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ సినిమాను ప్రభుత్వం తరఫున కాకుండా తానే ఆస్కార్ పోటీలకు పంపినట్టు అయోధ్య తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తుంపు పొందిన ఈ సినిమాలో నటించిన వారు అంధులే కావడం విశేషం.