ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం సాటి మనిషిగా ప్రతీ ఒక్కరి బాధ్యత. ఒకే నేలపై సాటి సమాజంలో ఉన్నప్పుడు స్పందించకపోతే మరి మనుషులం ఎలా అవుతాం? ఇక ప్రకృతి తన పంజా విసిరినప్పుడల్లా వారిని ఆదుకునేందుకు సినీ పరిశ్రమ ఎప్పుడూ ముందుటుంది. ఇక ఇప్పుడు భారీ వర్షాలతో కన్నీరు పెడుతున్న చెన్నై ని ఆదుకునేందుకు చిత్ర పరిశ్రమ ముందుకు వచ్చింది. సౌత్ లో సినీ పరిశ్రమకు బీజం వేసిన చెన్నై వరదలతో మునగడాన్ని చూసిన పలువురు టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు ఇప్పటికే వరద బాధితుల సహాయార్థం విరాళాలు ప్రకటించారు.
తోచినంత విధంగా 5 ,10 ,25 లక్షలను సాయం చేస్తున్నారు. అయితే స్టార్ హీరో హోదాలో ఉండి తక్కువ సాయం ప్రకటించటంపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. సినిమాల పేరిట వందల కోట్లు వెనకేసుకున్న నటులు సైతం 5. 10 లక్షలంటూ చిన్న చిన్న మొత్తాలను విరాళంగా ప్రకటించటం వర్మ లాంటి దర్శకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కానీ, కొరియోగ్రాఫర్ కమ్ డైరక్టర్ రాఘవ లారెన్స్ మాత్రం తనలో మరింత ఔన్నత్యం దాగుందని నిరూపించారు. తీవ్రంగా నష్టపోయిన చెన్నై కి కోటి రూపాయల విరాళాన్నిస్తున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. గతంలో కూడా పలు సేవాకార్యక్రమాలు నిర్వహించిన లారెన్స్, నిరుపేదల విద్య కోసం కూడా కోటి రూపాయల విరాళాన్ని అందించటం తెలిసిందే. సహయం చేసేందుకు స్టార్లు సైతం జంకుతున్న టైంలో లారెన్స్ ఇలా పెద్ద మొత్తం సాయం చేయటం నిజంగా అభినందనీయం.