ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బాహుబలి సినిమా కోసం భారత దేశం మొత్తంగా ఎదురు చూడ్డమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా గురించి చర్చ జరుగుతోంది. ఈ చిత్రం కోసం జులై 10 వ తేదీని కౌంట్ డౌన్ మొదలు పెట్టారు. ఈ నాటి కాలంలో ఎంతో శ్రమకోర్చి 200 పైగా కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ దర్శకుడికి అంకితం ఇస్తున్నట్లుగా చిత్ర దర్శకుడు రాజమౌళి ప్రకటించారు. అప్పట్లో తెలుగులో పలు హిట్ చిత్రాలను అందించిన అది కూడా జానపదాలు, పౌరాణిక, భక్తి చిత్రాల దర్శకుడు కె.వి.రెడ్డికి అంకితం ఇస్తున్నట్టు ప్రకటించారు. 1940-70లలో మధ్యలో ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాలను అందించిన కెవి రెడ్డి అంటే రాజమౌళికి చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమట. ఆయన తీసిన మాయాబజార్, పాతాళ భైరవి ఎవర్ గ్రీన్ చిత్రాలు. ఇక జగదేక వీరుని కథ, శ్రీకృష్ణార్జున యుద్ధం, వేమన, శ్రీకృష్ణ సత్య, గుణసుందరి, సత్యహరిశ్చంద్ర వంటి సినిమాలకు దర్శకత్వం వహించి, నిర్మించిన కె.వి.రెడ్డి (కదిరి వెంకట్ రెడ్డి) సినిమాలంటే ఆ కాలం వారే కాదు ఈనాటికీ అద్భుత సినిమాలుగా చూసే వారున్నారంటే ఆయన ప్రతిభను కొనియాడకుండా ఉండలేం... మరి ఈ కాలంలో అప్పటి ఆయన టేస్ట్ కు తగినట్టి ఈ ‘బాహుబలి’ చిత్రాన్ని అంకితం ఇవ్వడంపై దర్శకుడు రాజమౌళిని అభినందించి తీరాలి. ఇక ఈ సినిమాకు సంబంధించి లీకైన వీడియో గురించి రాజమౌళి మాట్లాడుతూ... ‘మనం ఎంతో నమ్మినవారే మనల్ని ఇలా మోసం చేస్తే చిన్న పిల్లల్లా ఏడవలేకపోయినప్పటికీ... కానీ మనసుకి మాత్రం చాలా భాధగా వుంటుంది’ అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా అందరి అంచనాలను అందుకునేలా వుంటుందని రాజమౌళి చెప్పుకొచ్చాడు.