రాజమౌళి మహాభారతంను తెరకెక్కించనున్నాడనే టాక్ కొంత కాలంగా వినిపిస్తున్నదే. ఆ ఇతిహాసాన్ని తెరకెక్కించడమే తన కల అని అన్ని మీడియాల్లో చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయాన్ని ఆయన దగ్గర ప్రస్తావించినప్పుడు, అదంత తేలికైన విషయం కాదని ఆయన సమాధానమిచ్చాడు. రాజమౌళి 'బాహుబలి' సినిమా రూపొందిస్తున్నప్పుడే ఈ సినిమా మహాభారతాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోందనే టాక్ వినిపించింది. ఇక ఈ సినిమా చూసిన తరువాత, మహాభారతాన్ని కూడా అద్భుతంగా తెరకెక్కించగల సమర్థత దర్శకుడిగా రాజమౌళికి ఉందనే ప్రశంసలు వెల్లువెత్తాయి.
బాహుబలి 2 నిర్మాణంలో బిజీగా వున్న రాజమౌళి దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావిస్తే, ఆయన తనదైన తరహాలో స్పందించాడు. తనపై గల అభిమానంతో ప్రేక్షకులు అలా అనుకుంటున్నారుగానీ, అదంత తేలికైన పని కాదని ఆయన అన్నాడు. మహాభారతాన్ని తాను తెరపై ఆవిష్కరించాలనుకున్న తీరు వేరనీ, దానిముందు బాహుబలి చాలా చిన్నదని ఆయన చెప్పాడు. తాను అనుకున్న స్థాయిలో మహాభారతం తెరకెక్కించడానికి తనకి మరింత అనుభవం అవసరమని అన్నాడు. ఆ స్థాయికి తగిన టెక్నికల్ నాలెడ్జ్ ను కూడా తాను సంపాదించుకోవలసి ఉంటుందని చెప్పాడు. అంటే ఆయన మహాభారతం చేయడానికి చాలా టైం పడుతుందనేది మాత్రం హింట్ ఇచ్చేశాడు.